
అమరావతి: గురువారం వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలిచి దుమ్ములేపింది.
ఇక 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 22 గెలుచుకుంది. ఈ వైసీపీ ప్రభంజనంలో టీడీపీలోని బడా నేతలు ఘోరంగా ఓడిపోయారు. మంత్రులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వైసీపీ దెబ్బకి మంత్రులు ఓటమి పాలయ్యారు.
చదవండి: ప్రతిసారి నియోజకవర్గం మార్చిన గంటా విజయం ఎలా సాధ్యం….?
అయితే రాష్ట్రంలో ఇంతటి వైసీపీ వేవ్‌లో కూడా దివంగత నేత ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులు ఘనవిజయం సాధించారు. ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్ నాయుడు, కుమార్తె భవానీ ఈ ఎన్నికల్లో గెలుపొందారు.
శ్రీకాకుళం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా రెండోసారి విజయం సాధించారు. 8,857 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి పేరాడ తిలక్‌పై విజయం సాధించాడు.
అలాగే ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కూడా ఈ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేశాడు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేసిన ఈయన వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 6,653 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే మొదటి నుంచి ఈ విజయం రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్‌ల మధ్య దోబూచులాడినప్పటికీ చివరికీ రామ్మోహన్ నాయుడే విజయం సాధించాడు.
దుమ్ములేపిన భవానీ..
ఇక రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రన్నాయుడు కుమార్తె భవానీ కూడా ఈ ఎన్నికల్లో భారీ విజయంతో గెలుపొందారు. అయితే భవాని ముందు నుంచి మంచి లీడింగ్‌లో ఉండి వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుపై 30,065 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబు తర్వాత టీడీపీలో భారీ మెజారిటీ ఈమెదే కావడం విశేషం.








