ఏపీలో టీడీపీ ఫెయిల్యూర్.. ఓ సగటు మధ్య తరగతి మనిషి విశ్లేషణ!

- Advertisement -

అమరావతి: పరిపాలనా అనుభవం లేదు, పెద్ద దొంగ, లక్ష కోట్ల అవినీతి, ప్రతి శుక్రవారం కోర్టు, తొందర్లోనే జైలుకు పోతాడు.. ఇలాంటి వ్యాఖ్యలతో ఒక రకమైన ముద్ర వేసి.. సోషల్ మీడియాతోపాటు రాష్ట్రంలోని మిగతా పార్టీలు సైతం ఆయనను ఎగతాళి చేశాయి. మరో ప్రక్క ఆయన క్త్రైస్తవుడు.. వస్తే వాడవాడలా చర్చిలు కడతారు అంటూ ప్రచారం.

అమ్మో జగన్ పార్టీ వస్తే కడప ఫ్యాక్షనిజం రాష్ట్రమంతా పాకేస్తుంది అంటూ మీడియాలో చర్చలు… వీటిన్నటి మధ్యా నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండి, ఆల్రెడీ అధికారం చేతిలో ఉన్న పార్టీపై  గెలవటం.. అదీ అఖండ మెజారిటీతో అంటే చెప్పుకున్నంత ఈజీ కాదు.

మిరకిల్ ఏమీ కాదు…

అలాగని ఏదో మిరకిల్ జరిగింది అంటే నేను ఒప్పుకోను. ఈ గెలుపు వైఎస్ జగన్ పడిన కష్టంతో వచ్చిందనేది ఎంత నిజమో.. .. చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా కూడా వచ్చింది అని చెప్పవచ్చు. 

రాష్ట్రం విడిపోగానే.. సమర్దుడు అనేకన్నా అనుభవం ఉన్న నాయకుడు లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు అని అంతా నమ్మారు. దాంతో 2014లో మంచి మెజారిటితో చంద్రబాబు నాయుడి చేతిలో అధికారం పెట్టారు. ఆ తర్వాత ఆయన అమరావతి అన్నారు.

పుష్కరాలు ఘనంగా జరిపించానన్నారు. ప్రత్యేకహోదా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మోడీపై ధ్వజం ఎత్తారు. పోలవరం పనులు ప్రారంభించాం అన్నారు. అంతా ఓకే.. అద్బుతమే. అలాగే నిరుద్యోగ భృతి, పసుపు కుంకుమ ఇలా బోలెడు సంక్షేమ పథకాలు (చివర్లో అయినా) మొదలెట్టారు. అదీ సూపర్.

మరి ఎక్కడ దెబ్బ కొట్టింది?

అమరావతిలో ఏం జరిగిందో కానీ అది రాజధాని కన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే  భూమి అని బాగా ప్రచారం జరిగింది. సరే అన్ని చోట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది.. అందులో వింతేముంది అంటే.. అదీ ఓకే.

అది పక్కన పెడితే.. ఒక సామాజిక వర్గానికే ప్రభుత్వం ప్రయారిటి ఇస్తుస్తోందనే విషయం జనాల్లోకి బాగా వెళ్లటం. అది సోషల్ మీడియాలో బాగా కనిపించింది. పార్టీని మోసిన సామాజిక వర్గమే… తమదే టీడీపీ అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. (అందరూ కాదనుకోండి.. )

అయితే .. ఈ భావన కచ్చితంగా మిగతా కులాల వారిలో చాలా మందికి ఇగోని దెబ్బతీసిందని చెప్పకతప్పదు. ఆంధ్రాలో ఎవరు కాదన్నా అవునన్నా కులాల లెక్కల్లోనే రాజకీయాలు నడుస్తూంటాయి. 

అవినీతి అంతింత కాదయా…

ఇక అధికారుల్లో అవినీతి… వామ్మో.. ఆంధ్రాలో గత అయిదేళ్లలో అది పరాకాష్టకు చేరింది. దానికి నేనే ప్రత్యక్ష్య సాక్షిని. నేను చాలాసార్లు ఆ విషయంలో గొడవలు కూడా పడ్డా. ఇవన్నీ ఎంతో అనుభవం ఉన్న.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడికి తెలియక కాదు.. కానీ ఎందుకనో ఆయన ఉదాశీనంగా ఉండిపోయారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో దాదాపు చాలా మందికి అసంతృప్తి. పాఠాలు చెప్పటం తప్ప అన్ని పనులు చేయిస్తున్నారని టీచర్లు గోల. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వారికైతే రోజూ టార్చరే. నిద్రా, నిప్పులు లేకుండా ఇరవైనాలుగు గంటలూ పనే పని.(వీఆర్వేలకు మరీ పది వేలే జీతం).  మరో డిపార్మెంట్ వాళ్లది మరో రకం గోల.

ఒక్క రేషన్ కార్డ్ తెచ్చుకోలేకపోయాం…

ఘోరం ఏమిటంటే.. మా ఆంధ్రాలో ఇన్నేళ్లలో మా ఫ్యామిలీకి విడిగా ఒక రేషన్ కార్డ్ తెచ్చుకోలేకపోయాం. ఎన్నిసార్లు జన్మభూమిల్లో అప్లికేషన్స్ పెట్టామో.. మా అమ్మగారికి ఉండే రేషన్ కార్డ్‌ని తిరిగి లైవ్‌లోకి తేవటానికి పెద్ద పోరాటమే చెయ్యాల్సి వచ్చింది. అది రాలేదని మా అమ్మగారి వింతంతు పెన్షన్ కూడా ఆపేశారు.

బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్‌లో రుణాలకు సంబంధించి శిక్షణ అయితే ఇచ్చారు కానీ రుణాలు మాత్రం ఇవ్వలేదు. దానికి బ్యాంక్ తో లింక్‌లు. సరైన సమాధానం ఎవరూ చెప్పరు (ఇది మా కుటుంబంలో ఒకరి విషయంలో స్వయంగా నేను చూసింది).  ఇక హిందువుల్లో చాలా మందికి తిరుపతి విషయంలో జరిగిన గొడవలుకు మనసులో తీవ్ర ఆవేదన ఉంది.

పోయి పోయి.. కాంగ్రెస్‌తోనా?

మోడీతో చంద్రబాబు గొడవ పెట్టుకోవడం వల్ల ఆయన అభిమానులకు సహజంగానే మండితే… పోయి పోయి కాంగ్రెస్‌తో కలవటం తెలుగుదేశం పార్టీలో మొదట నుంచి అభిమానిస్తున్న వాళ్లకీ రుచించలేదు. ఇక ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు యూటర్న్ ల  గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడేదేమీ లేదు.

ఇలా క్షేత్ర  స్దాయిలో చాలా ఇబ్బందులు, సమస్యలు. ఇవన్నీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై ప్రభావం చూపెడతాయా అనొచ్చు .. కచ్చితంగా. ఇబ్బంది పడిన మనిషి… కోపం పెట్టుకుంటాడు. (ఇంకా నేను ఇసుక మాఫియా వంటి విషయాలు ప్రస్తావించలేదు)

చంద్రబాబు అంటే ఎప్పటికే గౌరవమే…

ఇవన్నీ తెలుగుదేశం మీద కోపంతో  రాస్తున్నవి కాదు.. అలాగే మరో పార్టీ మీద అభిమానంతోనూ కాదు.  నాలాంటి మధ్యతరగతి వాళ్లకు ప్రత్యేకంగా ఏ పార్టీ వచ్చినా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. చివరకు చిన్న ఇల్లు కూడా గవర్మమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకోలేం. చిన్న పని కూడా చేయించుకోలేం. అది అందరికీ తెలుసు. కాకపోతే రాష్ట్రంలో ఓ పౌరుడుగా.. మాట్లాడాలనిపించి రాస్తున్నాను.

మంచి అడ్మినిస్ట్రేటర్‌గా, టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే పొలిటీషియన్‌గా చంద్రబాబు అంటే నాకు ఎప్పటికే గౌరవమే. 

కచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన ముందు ఉండే సమస్యలు కూడా దాదాపు ఇవే.. ఇలాంటివే.  క్షేత్ర స్దాయిలో సామాన్యుడ్ని నిర్లక్ష్యం చేస్తే, వాడి ఇగో మీద, వాడి కులం మీద దెబ్బ కొడితే  పరిస్దితి ప్రతికూలంగానే మారుతుంది. మరి జగన్ ఇవన్నీ అధిగమిస్తారని ఆశిస్తూ.. శుభాకాంక్షలు.

( ఫైనల్‌గా ఈ ఆర్టికల్  తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదు… ఓ చిన్న విశ్లేషణ అంతే.. )

నా విశ్లేషణ నిజమే అని మీకు అనిపిస్తే.. షేర్ చేయండి.. థాంక్యూ

 – సూర్యప్రకాశ్ జోశ్యుల

- Advertisement -