శిరస్సు వంచిన శిఖరం! పర్వతారోహణలో.. హైదరాబాద్ వండర్ కిడ్ కార్తికేయ!!

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రస్తుత కాలంలో పది అడుగులు వేయాలంటేనే నేటి యువతకు మహా చిరాకు… ఇక కొండలు, గుట్టలు  ఎక్కమంటే మావల్ల కాదంటూ చేతులెత్తేస్తారు.

కానీ ఈ కుర్రాడు మాత్రం అలా కాదు.. వందలు, వేల మీటర్ల ఎత్తున్న కొండల్ని, పర్వతాలను కూడా అలవోకగా ఎక్కేస్తున్నాడు. ఎముకలు కొరికే చలిలో మంచు పర్వతాలను సైతం అధిరోహిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇప్పటికే ప్రపంచంలోని ఏడు ఎత్తైన పర్వతాల్లో రెండింటిని తన ఖాతాలో వేసుకుని ఔరా అనిపిస్తున్నాడు. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ఇంతా చేసి ఆ కుర్రాడి వయస్సు కేవలం పదమూడేళ్లే..

ఆ కుర్రాడు..  హైదరాబాద్‌కు చెందిన వండర్ బాయ్ పడకంటి విశ్వనాథ్ కార్తికేయ!

పిన్న వయస్సులోనే…

హైదరాబాద్ లోని బోయిన్ పల్లి ఫిరోజ్ గూడకు చెందిన రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి దంపతుల కుమారుడైన విశ్వనాథ్ కార్తికేయ్… బోయిన్ పల్లిలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తూ ప్రపంచ రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు.

ఈ ఏడాది ఇప్పటికే రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం, దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో, ఆస్ట్రేలియాలోని కొసియుస్కో పర్వతాన్ని ఎక్కాడు. అర్జెంటీనాలో మరో ఎత్తైన పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో ఉన్నాడు.

ఆ లక్ష్యం దిశగా..

ప్రపంచంలోని ఏడు పర్వతాలను అధిరోహిండమే తన లక్ష్యంగా పెట్టుకున్న విశ్వనాథ్ కార్తికేయ…పర్వతారోహణ మొదలుపెట్టిన రెండేళ్లలోనే ఈ ఘనతలన్నీ అందుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

నిజానికి 2020 వరకు విశ్వనాథ్ కార్తికేయ వట్టి బద్దకస్తుడు. పది అడుగులు వేయాలంటేనే చిరాకుపడేవాడు. కానీ అతన్ని తీరును మార్చిన ఘనత సోదరి వైష్టవికే దక్కుతుంది.

సరిగ్గా రెండేళ్ల కిందట పర్వాతారోహకురాలైన సోదరి స్ఫూర్తితో ట్రెక్కింగ్ వైపు అడుగులు వేశాడు.వైష్ణవితో కలిసి సరదాగా ట్రెక్కింగ్ ప్రారంభించిన విశ్వనాథ్ కార్తికేయ…దానిపై ఆసక్తి పెంచుకున్నాడు.

తల్లిదండ్రులు లక్ష్మి, రాజేంద్రప్రసాద్, తాత శివకుమార్ ప్రోత్సహంతో ఇక వెనుదిరిగి చూడలేదు.తన పాఠశాల టీచర్లు, కోచ్ భరత్ ప్రోత్సహం కూడా తోడవడంతో ట్రెక్కింగ్ ప్రోఫెషనల్ గా మార్చుకున్నాడు.

వైఫల్యాల నుంచి విజయాల వైపు..

11 ఏళ్ల వయస్సులో పర్వతారోహణపై మక్కువ పెంచుకున్న విశ్వనాథ్ కార్తికేయ… సోదరితో కలిసి కోచ్ భరత్ వద్ద శిక్షణ పొందాడు.

2020 అక్టోబర్‌లో అక్క వైష్ణవితో కలిసి ఉత్తరాఖండ్‌లోని 5వేల 800మీటర్ల ఎత్తయిన రుదుగైర పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

1000మీటర్ల వరకు వెళ్లి సాధ్యం కాక వెనక్కి వచ్చేశాడు.అదే ఏడాది డిసెంబర్ లో డెహ్రాడూన్ లోని నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ లో 15 రోజుల పాటు శిక్షణ పొందాడు.

అటు తర్వాత 2021 అగస్టులో రష్యాలోని 5వేల 600 మీటర్ల ఎల్బ్రస్ పర్వతం ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈసారి దాదాపు శిఖరాగ్రానికి చేరుకున్నాడు.

అయితే 5400 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాక విశ్వనాథ్ కార్తికేయకు వెనుదిరగాల్సి వచ్చింది. రష్యాలోనూ అతనికి వైఫల్యం ఎదురైనా.. ఆ అపజయం అతనిలోని పట్టుదలను మరింత పెంచింది.. ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

పట్టుదలే పెట్టుబడిగా…

రియల్ హీరోలకు వైఫల్యాలు విజయానికి సోపానాలవుతాయన్నది విశ్వనాథ్ కార్తికేయ నిరూపించాడు. సరదా కోసం పర్వతాన్ని ఎక్కుతూ భంగపడిన బాలుడు తర్వాత దాన్ని అభిరుచిగా మార్చుకున్నాడు.

తల్లిదండ్రుల సాయంతో తెల్లవారుజామున 4గంటలకు లేచి రోజుకు రెండు, మూడు గంటల చొప్పున 8 నెలలు శిక్షణ పొంది రాటుదేలాడు. ఈ ఏడాది విశ్వనాథ్ కు విజయాల మీద విజయాలు దక్కాయి.

మొదట ఈ ఏడాది ఏప్రిల్ లో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను అధిరోహించాడు. అదే నెలలో 5వేల 77 మీటర్ల నాగల్ షంగ్ పర్వతాన్ని ఎక్కేశాడు.

మే 23న హిమాచల్‌ప్రదేశ్‌లోని 5వేల 280 మీటర్ల ఫ్రెండ్‌షిప్‌ పీక్‌ పర్వతాన్ని కేవలం ఏడు రోజుల్లో ఎక్కి ఆసియా బుక్స్ లో చోటు సంపాదించాడు.

ఒక్కో మౌంటెయిన్ కొల్లగొడుతూ…

ఇక ఆ తరువాత విశ్వనాథ కార్తికేయ వెనుతిరిగి చూడలేదు. లడఖ్, లేహ్‌లోని 6 వేల 250 మీటర్లు అంటే 21వేల 312 అడుగుల ఎత్తులో ఉండే కాంగ్ యట్స్, దాదాపు అదే ఎత్తులో ఉండే మౌంట్ డోజో జోంగో పర్వత శిఖరాగ్రాలకు గడ్డ కట్టే చలిలో సైతం కార్తికేయ్ చేరుకుని ఔరా అనిపించాడు.

జూలై 9న కాంగ్ యట్సే మరియు జో జోంగోకు ట్రెక్కింగ్ ప్రారంభించి, జూలై 22న ముగించాడు.

బేస్ క్యాంప్ నుండి శిఖరానికి ప్రయాణం అంత సులువేం కాదు. ఎత్తైన ప్రదేశాలలో గాలి పీడనం తగ్గే పరిస్థితి ఉంటుంది. గడ్డకట్టే చలి మరో సవాల్. వీటన్నింటిని కార్తికేయ్ అధిగమించి రెండు పర్వతాలను అధిరోహించాడు.

భారత పతకాన్నిరెపరెపలాడించాడు. రికార్డులను తిరగరాశాడు. ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా కార్తికేయ్ రికార్డు నెలకొల్పాడు. మొదట్లో ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

వైఫల్యం ఎదుర్కొన్న చోటే విజయతీరాలపై…

ఇక గతంలో ఎక్కడైనా తనకు వైఫల్యం ఎదురైందో అక్కడే విజయగర్వంతో కార్తికేయ్ నిలిచాడు. అగస్టు 15న రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని రెండు వైపుల నుంచి కేవలం 24 గంటల్లోనే అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఎల్బస్ పర్వతం ఈస్ట్ వైపు నుంచి 5వేల 621 మీటర్లు, ఎల్బస్ పర్వతం వెస్ట్ నుంచి 5వేల 642 మీటర్లను గంటల వ్యవధిల్లోనే అధిరోహించాడు.

తాజాగా అక్టోబర్ లో దక్షిణాఫ్రికాలోని 5వేల 895 మీటర్ల కిలిమంజారో పర్వతం, ఆస్ట్రేలియాలోని ఎత్తైన కొసియుస్కో పర్వతాన్ని ఎక్కాడు.

ప్రస్తుతం అర్జెంటీనాలో మరో ఎత్తైన పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో కార్తికేయ్ ఉన్నాడు. ఎవరెస్ట్ శిఖరం, ప్రపంచంలోని ఏడు శిఖరాలను అధిరోహించడమే తన లక్ష్యమని కార్తికేయ్ చెబుతున్నాడు.

మొదటి ట్రెక్కింగ్ మౌంట్ రుదుగైరా, ఆ తర్వాత ఎల్బ్రస్ పర్వతారోహణలో విఫలమైనప్పటికీ.. నిరంతర అభ్యాసం, సరైన ఫిట్‌నెస్, శిక్షణతో విజయాల బాట పట్టినట్లు కార్తికేయ తెలిపాడు.

చదువుల్లోనూ మేటి..

ప్రపంచంలోని మొత్తం ఏడు ఎత్తైన పర్వతాల్లో రెండు పర్వతాలను అధిరోహించిన విశ్వనాథ్ కార్తికేయను తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు సెయింట్ పీటర్ స్కూల్ కరస్పాండెంట్ టి.అల్ఫోన్స్ రెడ్డి, ప్రిన్సిపాల్ సువర్ణ అభినందించారు.

తమ పాఠశాల గర్వించే విజయాలను కార్తికేయ్ అందుకుంటున్నారని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్తికేయ ఇటు చదువుల్లోనూ, ఆటల్లోనూ మెరుగ్గా రాణిస్తున్నాడని ప్రిన్సిపాల్ సువర్ణ చెప్పారు.

గొప్ప పట్టుదలతో కార్తికేయ్ ముందుకు సాగుతున్న తీరు అద్భుతమన్నారు.

ఎవరెస్ట్‌ కూడా అధిగమిస్తాడు…

విశ్వనాథ్ కార్తికేయ్ మొదట్లో విఫలమైనా, ఆ తర్వాత వాటి నుంచి వేగంగా పాఠాలు నేర్చుకుని మెరుగయ్యాడని అతని కోచ్ భరత్ చెప్పారు.

ఇప్పుడు పరిస్థితి చాలా మారిందని, కార్తికేయ్ తను అనుకున్న ఎవరెస్ట్ లక్ష్యాన్ని కూడా అధిగమిస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చాలా గర్వంగా ఉంది…

తన కుమారుడు అంత ఎత్తుకు చేరుకున్నాడంటే చాలా గర్వంగా, ఆనందంగా ఉందని కార్తికేయ తల్లి లక్ష్మి చెప్పారు. కార్బొహైడ్రేట్లు, కూరగాయలు, విటమిన్లు ఉండే విధంగా ఆహారాన్ని అందించడంతో పాటు ఉదయం 5 గంటలకు నిద్రలేపి జిమ్‌కు తీసుకెళ్లేవాళ్లమన్నారు. అతడి విజయాల వెనుక తాత ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు.

- Advertisement -