
అమరావతి: గత గురువారం వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 25 పార్లమెంట్ స్థానాలకి గాను 22 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. ఇక మూడు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది.
అయితే టీడీపీ ఈ మూడు స్థానాలని స్వల్ప మెజారిటీ తేడాతోనే కైవసం చేసుకుంది. గుంటూరులో గల్లా జయదేవ్ 4203 ఓట్లతో గెలవగా, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్నాయుడు దాదాపు 6 వేల మెజారిటీతో గెలిచారు. అలాగే విజయవాడ నుంచి కేశినేని నాని సుమారు 9వేల మెజారిటీతో విజయం సాధించారు.
ఈ క్రమంలోనే విజయవాడ వదిలేసి గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాలు తమ ఖాతాలో చేరాల్సినవని, ఎన్నికల అధికారుల తప్పిదం కారణంగా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయని ఆయా స్థానాలకు పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు అధినేత జగన్ వద్ద మొరపెట్టుకున్నారు.
దీంతో ఆయా లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని వైసీపీ భావిస్తోంది. నిన్న గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాల అభ్యర్థులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి తదితరులు భేటీ అయ్యారు.
అయితే గుంటూరు పోస్టల్ బ్యాలెట్ల అంశంపై అక్కడి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మోదుగుల ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్ల సంఖ్య దాదాపు 9 వేలకు పైనే ఉందని, వాటిని లెక్కించలేదని, వాటిని లెక్కిస్తే తన విజయం ఖాయమై ఉండేదని మోదుగుల విజయసాయి వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.
ఇక నేతల ఫిర్యాదులని పరిగణనలోకి తీసుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈరోజు పిటిషన్ వేసే అవకాశం ఉంది.
చదవండి: ఏపీలో టీడీపీ ఫెయిల్యూర్.. ఓ సగటు మధ్య తరగతి మనిషి విశ్లేషణ!








