

కర్నూలు: రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగవిప్పింది. జిల్లాలోని దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, మండలాధ్యక్షుడు సోమేశ్వర్ గౌడ్ దారుణ హత్యకు గురయ్యారు. సోమేశ్వర్ గౌడ్‌కు పల్లెదొడ్డిలో ఓ మద్యం షాపు ఉంది. శుక్రవారం రాత్రి షాపు మూసేసిన తర్వాత కుమారుడితో కలిసి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.
మార్గం మధ్యలో మాటు వేసిన ప్రత్యర్థులు.. సోమేశ్వర్ కళ్లలో కారం చల్లి హత్య చేసేందుకు ప్రయత్నించారు. వారి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వేటకొడవళ్లతో వెంటాడి మరీ ఆయన్ని నరికి చంపారు.
ఈ ఘటనలో సోమేశ్వర్ గౌడ్ అక్కడికక్కడే మరణించగా… ఆయన కుమారుడికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలియగానే టీడీపీ కార్యకర్తలు అక్కడికి భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేయడంతో వెంకటాపురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ హత్య గురించిన సమాచారం అందగానే పోలీసులు కూడా భారీ సంఖ్యలో గ్రామానికి చేరుకుని మోహరించారు.








