కాంగ్రెస్‌ అధిష్ఠానంపై రేవంత్ రెడ్డి అలక, ఆ 8 టిక్కెట్లు ఇవ్వకపోతే…

- Advertisement -

congress-working-president-revanth-reddy

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ వ్యవహారంపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.  దీనికితోడు టిక్కెట్లు రాని నేతలు రెబల్స్‌గా మారి పార్టీపై, పార్టీ అధిష్ఠానంపై విమర్శలు సంధిస్తున్నారు.  తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా పార్టీ అధినాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు.  తన అనుచరులకు కూడా టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు.

తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు, మిత్రపక్షాలకు కొన్ని కీలక సీట్లు ఇవ్వాల్సి రావడంతో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల పంపిణీ వ్యవహారంలో ఆచి తూచి అడుగులేస్తోంది.  ఫలితంగా మహాకూటమి అభ్యర్థుల ఎంపికలో విపరీత జాప్యం జరుగుతోంది.  మరోవైపు చాలామంది నేతలు తమతో పాటు తమ అనుచరులకు సైతం పార్టీ టికెట్లు ఇవ్వాలని మొండిపట్టు పడుతున్నారు.

నేతల అల్టిమేటం…

ఇప్పటికే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పలుమార్లు సమావేశమై  74 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. పోటీ తీవ్రంగా ఉన్న మరో 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.  ఈ నేపథ్యంలో తన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ టికెట్‌ ఇవ్వకపోతే తాము పోటీ నుంచి తప్పుకుంటామని ఇప్పటికే కోమటిరెడ్డి సోదరులు ప్రకటించారు.

ఈ నిరసనల పర్వం జాబితాలోకి తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఇచ్చిన ఏ హామీని హైకమాండ్ పట్టించుకోవడం లేదంటూ రేవంత్ రెడ్డి అలకబూనారు. ఈ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు.  రేవంత్ రెడ్డి తన అనుచరుల కోసం ప్రధానంగా 8 సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. అవి

1. వరంగల్ పశ్చిమం (నరేందర్ రెడ్డి)
2. నిజామాబాద్ గ్రామీణం (అరికెల నర్సారెడ్డి)
3. ఆర్మూరు (రాజారామ్ యాదవ్)
4. ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి)
5. దేవరకొండ (బిల్యా నాయక్)
6. ఇల్లందు (హరిప్రియ)
7. సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి)
8. చెన్నూరు (బోడ జనార్దన్)

- Advertisement -