చెన్నై: బీజేపీయేతర నాయకులను, పార్టీలను కూడగట్టే పనిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం చెన్నై వెళ్లి.. డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటులో భాగంగా చర్చలు జరిపేందుకు చెన్నై చేరుకున్న చంద్రబాబు.. విమానాశ్రయం నుంచి నేరుగా స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబుకు స్టాలిన్, కనిమొళితో పాటు డీఎంకే సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత వారు పలు విషయాలపై చర్చించారు. అనంతరం డీఎంకే అధినేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ నేతలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలుస్తుండటం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు తాను పూర్తిగా సహకరిస్తానని కూడా స్టాలిన్ చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీని గద్దె దించేందుకు చర్చలు జరుపుతున్నామని… ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని చంద్రబాబు కలిశారని తెలిపారు.
ఢిల్లీ లేదా మరో చోట బీజేపీయేతర నేతలం అందరం కలుస్తామని, తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని స్టాలిన్ పేర్కొన్నారు.