

కోల్‌కతా: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యాయి. టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీయేతర పార్టీల నేతలు ఐక్య ర్యాలీకి తరలివచ్చారు. పాల్గొన్న నేతలందరూ బీజేపీపై తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
మోడీ ప్రభుత్వం గడువు ముగిసింది: మమతా బెనర్జీ
విపక్ష పార్టీలన్నీ అమరావతికి రావాలి: చంద్రబాబు ఆహ్వానం
కోల్‌కతాలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. మొదట బెంగాలీలో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశాన్ని కాపాడుకోవాలనేదే తమ అందరి లక్ష్యమని వ్యాఖ్యానించారు. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే విపక్షాలుగా తాము ఏకం చేయాలనుకుంటున్నామని అన్నారు.
విపక్షాల ఐక్యతకు గొప్ప వేదికను ఏర్పాటు చేశారంటూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని చంద్రబాబు ప్రశంసించారు. విభజించు పాలించు అనే రీతిలో బీజేపీ దేశాన్ని పాలిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. రైతుల కష్టాలు కేంద్రానికి పట్టడం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు.
పెద్ద నోట్ల రద్దే అందుకు నిదర్శనమని చెప్పారు. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. పనికంటే ప్రచారానికే మోడీ ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాల హక్కు కాలరాసి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఈవీఎంలను కాకుండా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కోల్‌కతాలో నిర్వహించినట్లుగానే అమరావతిలో కూడా భారీ సభ నిర్వహించాలనుకుంటున్నట్లు, ఇక్కడికొచ్చిన నేతలంతా రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. దీనికి స్పందించిన మమతా బెనర్జీ.. తప్పకుండా వస్తామన్నారు. ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ సభ నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు.
దేశ ప్రజలు చితికిపోయారు: మల్లిఖార్జున ఖర్గే
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ సందేశాన్ని చదివి వినిపించారు. దేశ వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరుగుతోందని, యువత, నిరుద్యోగుల్లో తీవ్ర నిస్పృహ నెలకొందని, ఆర్థికంగా దేశప్రజలు చితికిపోయారని ఆ సందేశంలో సోనియా పేర్కొన్నారు. అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.
బీజేపీ.. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది
ప్రజాస్వామ్య పరిరక్షణకు విపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరముందని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దేశంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని దుయ్యబట్టారు. దేశాన్ని చిన్నాభిన్నం చేసి పాలించాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందని యశ్వంత్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లో అల్లర్లు, కాల్పులకు కారణమెవరని ఆయన ప్రశ్నించారు. మరో కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరి మాట్లాడుతూ.. బీజేపీ ఒంటెద్దు పోకడలకు పెద్దనోట్ల రద్దే నిదర్శనమన్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అస్థిరం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని మండిపడ్డారు.
మార్పు సాధించడమే లక్ష్యం: శరద్ పవార్
విధివిధానాలు సిద్ధం చేసుకోవాలి: దేవెగౌడ
భవిష్య కార్యాచరణ ఎలా అన్నదే మనందరి ముందున్న ప్రధానమైన ప్రశ్న అని జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. కోల్ కతాలో బీజేపీ యేతర పక్షాల ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, అప్పటికే మనం అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని, కూటమి విధివిధానాల అజెండా సిద్ధం చేసుకోవాలని సూచించారు.
వారిని తరిమి కొట్టాలి: కేజ్రీవాల్
‘భారతదేశాన్ని విడగొట్టాలని పాకిస్తాన్ 70 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. కానీ ప్రధాని మోదీ కేవలం ఐదేళ్లలోనే దేశాన్ని విడగొట్టారు. విద్వేషాలను రెచ్చగొట్టి కుల, మత ప్రాతిపదికన ప్రజలను విడదీశారు. మోదీ- అమిత్ షాలను తరిమికొట్టేందుకే సమూహంగా ఏర్పడ్డాం’ అని ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వంది నియంతృత్వ పోకడ
‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ పాలన సాగుతోంది. బీజేపీది నియంత వైఖరి. ఆ పార్టీ కుట్రలతో పేద రైతులు ఎంతగానో నష్టపోతున్నారు. కర్ణాటకలో రైతు రుణమాఫీని విఫలం చేయాలని బీజేపీ కుట్ర చేసింది. ఆ పార్టీ కార్పొరేట్లను ఒకలాగ, రైతులను ఒకలాగా చూస్తోంది’ అని కర్ణాటక సీఎం కుమారస్వామి దుయ్యబట్టారు.
ఈవీఎంలు చోర్ మెషిన్లు: ఫరూక్ అబ్దుల్లా
ఈవీఎంలు చోర్ మెషిన్లు.. ఎన్నికలు సజావుగా జరగాలంటే తిరిగి పేపర్ బ్యాలెట్ల విధానం రావాల్సిన అవసరం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను కుల, మతం పేరిట విభజించి పాలిస్తోందని ఫరూక్ ఆరోపించారు. జమ్ముకాశ్మీర్‌లో ఏర్పడ్డ పరిస్థితికి బీజేపీనే బాధ్యత వహించాలని, తాను ముస్లింని.. కాశ్మీరీని అయినా ఈ దేశంలో భాగమని అన్నారు. అంతా కలిసి పోరాడి బీజేపీని ఓడించాలని అన్నారు.
మోడీని గద్దె దించాలి..: స్టాలిన్
‘స్వాత్రంత్యం కోసం ఇది మరో పోరాటం. బీజేపీని గద్దె దింపాలి. మోదీని ఇంటికి సాగనంపాలి. మనమంతా ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది’ అని పేర్కొన్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నారు. ‘మతవాద పోకడల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు సాగుతున్న పోరాటమిది. బీజేపీని ఓడించండి.. మోడీని గద్దె దించండి.. దేశాన్ని కాపాడండి.. ఇదే మన నినాదం’ అని వ్యాఖ్యానించారు.
నాశనం చేస్తున్నారు: శరద్ యాదవ్
కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలను నాశనం చేసిందని, ఒక్క దాన్ని కూడా వదలలేదని ర్యాలీలో పాల్గొన్న లోక్ జనశక్తి పార్టీ చీఫ్ శరద్ యాదవ్ ఆరోపించారు. దేశం ప్రమాదంలో ఉందని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.
దొంగలకు వ్యతిరేకంగా మా పోరాటం: హార్దిక్
సుభాష్ చంద్రబోస్.. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. తామంతా దొంగలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని గుజరాత్ పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ అన్నారు. దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ మాట్లాడుతూ.. ‘దేశం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనలో పేదలు, మైనార్టీలు, దళితులు దోపిడీకి గురవుతున్నారు’ అని విమర్శలు గుప్పించారు.
విద్వేషాలలు రెచ్చగొడుతున్నారు: అఖిలేశ్ యాదవ్
బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రతిపక్షాలను భయపట్టేందుకు బీజేపీ దర్యాప్తు సంస్థలతో దోస్తీ కడితే.. తాము ప్రజలతో కలిసి కూటమిగా ఏర్పడుతున్నామని చెప్పారు. తమిళనాడులో బీజేపీ జీరో అయినట్టే మిగతా రాష్ట్రాల్లో కూడా కావాలని అన్నారు.








