28.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home Uncategorized మాట్లాడుకోలేని నేతలు.. వాటాలు పంచుకుంటున్నారు: విపక్షాలపై మోడీ విమర్శనాస్త్ర్రాలు, ‘శత్రుఘ్న అవకాశవాది’

మాట్లాడుకోలేని నేతలు.. వాటాలు పంచుకుంటున్నారు: విపక్షాలపై మోడీ విమర్శనాస్త్ర్రాలు, ‘శత్రుఘ్న అవకాశవాది’

narendra modi
- Advertisement -

narendra modi

గాంధీనగర్‌: పశ్చిమబెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల ర్యాలీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినవారంతా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

వారంతా మోడీ వ్యతిరేకులు కాదనీ, దేశానికి, ప్రజల అభివృద్ధికి వ్యతిరేక శక్తులని విమర్శించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారే తమపై ఆరోపణలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. గుజరాత్‌ పొరుగున్న ఉన్న సిల్వసాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు.

ప్రజల సొమ్మును దోచుకోకుండా అడ్డుపడుతున్నందుకు వారికి తనపై కోపం రావడం సహజమేనని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. మహాకూటమి నేతల్లో ఒకరినొకరు కలిసి మాట్లాడుకోలేని నాయకులు అప్పుడే వాటాలను పంచుకోవడం మొదలుపెట్టారని మోడీ ఆరోపించారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా మోదీ సిల్వసాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

శత్రుఘ్న సిన్హా అవకాశవాది: రూడీ తీవ్ర విమర్శలు

కోల్‌కతాలోని బ్రిగేడ్‌ మైదానంలో విపక్షాలు చేపట్టిన ఐక్యతా ర్యాలీకి బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా హాజరుకావడంపై ఆ పార్టీ నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ తీవ్రంగా స్పందించారు. సిన్హా పేరు ప్రస్తావించకుండానే.. ‘కొంతమంది తెలివి వేరే విధంగా ఉంటుంది. కొంతమంది బీజేపీ స్టాంప్‌తో అధికారంలోకి వచ్చి అన్ని సౌకర్యాలు పొందుతారు. అందుకే అలాంటి వాళ్లు తమ సభ్యత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అదే విధంగా వేదికలపైకి ఎక్కి సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశవాదుల్లాగా మారతారు. బీజేపీ వారిని పరిగణనలోకి తీసుకుంటుంది’ అని రూడీ.. సిన్హాను హెచ్చరించారు.

మోడీకి వ్యతిరేకంగా చేపట్టారని, దాని వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. ‘నరేంద్ర మోడీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ప్రజలు చూశారు. రానున్న ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

అవినీతి నేతలంతా ఏకమయ్యారు

దేశంలోని అవినీతి నేతలంతా ఏకమయ్యారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబుల్‌ సుప్రియో విపక్షాల ఐక్యతా ర్యాలీపై విమర్శలు చేశారు. అంతా ఒకచోట చేరి కపట బుద్ధిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ‘ర్యాలీలకు పిలుపునివ్వడానికి బదులుగా వాళ్లు భారత దేశాన్ని మరింత ఉత్తమంగా తయారు చేయడానికి పిలుపునివ్వాల్సింది’ అని సుప్రియో ట్వీట్‌ చేశారు. పార్టీలు స్వప్రయోజనాల కోసం కలుస్తున్నాయని, ఇది అపవిత్రమైన పొత్తు అని సుప్రియో వ్యాఖ్యానించారు.

- Advertisement -