

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. వైసీపీలో కీలక నేతగా ఉన్న వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్కు లేఖ పంపారు.
కాగా, అంతకుముందు రాధాతో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. పార్టీ వీడవద్దంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే రాధా డిమాండ్పై అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బొత్స బుజ్జగింపులు ఫలించలేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు ఇవ్వాలని కొంతకాలంగా రాధా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై జగన్ నుంచి హామీ లభించలేదు. ఈ నియోజకవర్గానికి ఇప్పటికే మల్లాది విష్ణును పార్టీ ఇంఛార్జీగా ప్రకటించారు.
విజయవాడ సెంట్రల్ బదులు రాధా గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయవాడ తూర్పు నుంచి కానీ, మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి కానీ పోటీ చేయాలని వైసీపీ అధిష్ఠానం వంగవీటికి గతంలోనే సూచించింది. దీనిపై ఆయన సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో రాధా వైసీపీని వీడతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రాధాకృష్ణ ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. అప్పుడు కూడా ఆయన ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.
రెండ్రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధాకృష్ణ
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం రాధా ఇంటి వద్దకు ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. వంగవీటి వైసీపీ రాజీనామా చేస్తున్నట్లు రాధా లేఖ పంపించారు. అంతేగాక, అనంతరం రాధా విలేకరులతో మాట్లాడుతూ.. ఏ పార్టీలో చేరాలనే విషయమై తన అభిమానులతో మాట్లాడి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. తన రాజీనామాకు గల కారణాలను, భవిష్యత్తు కార్యాచరణను అప్పుడే చెబుతానని పేర్కొన్నారు.
వైసీపీని వీడుతున్న వంగవీటి అనుచరులు
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రాజీనామాతో ఆయన మద్దతుదారులు కూడా వైసీపీని వీడుతున్నారు. ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. రాధాకృష్ణకు మద్దతుగా ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి లేఖలను వైసీపీ కార్యాలయానికి పంపారు. విజయవాడ కార్పొరేషన్లోని 24వ డివిజన్ కార్పొరేటర్ చందన సురేశ్, 17వ డివిజన్ కార్పొరేటర్ చోడిశెట్టి సుజాత, 15వ డివిజన్ కార్పొరేటర్ దామోదర్, 16వ డివిజన్ కార్పొరేటర్ మద్దాల శివశంకర్, 18వ డివిజన్ కార్పొరేటర్ పాల ఝాన్సీలక్ష్మిలు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వారు మాట్లాడుతూ తామంతా రాధా వెంటే ఉంటామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఆఫర్ చేసిన టీడీపీ
రాధా టీడీపీలో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆ పార్టీ ప్రతిపాదించినట్లు తెలిసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
వంగవీటి రాకపై అభ్యంతరం లేదు: బుద్ధా వెంకన్న
వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరతానంటే తమకు అభ్యంతరం లేదని, ఆయనను పార్టీలోకి స్వాగతిస్తున్నామని టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న చెప్పారు. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్కు, రాధాకు ఉన్న పాత గొడవలతో దీనికి సంబంధం లేదన్నారు. జగన్మోహన్రెడ్డి లాంటి నియంతతో కలిసి ఎవరూ కొనసాగలేరని దుయ్యబట్టారు.








