29.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తొలి ప్రసంగం: కీలకాంశాలివే..

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తొలి ప్రసంగం: కీలకాంశాలివే..

governor
- Advertisement -

హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం పయనిస్తోందని గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ వ్యాఖ్యానించారు. రెండోసారి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా ఉభయసభలను ఉద్దేశించి ఆయన‌ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు నరసింహన్‌ అభినందనలు తెలిపారు.

అనంతరం ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అవినీతికి తావులేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని తెలిపారు. జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు.

ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి…

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారం అయిందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం ముందుకుసాగుతోందని.. విద్యుత్‌ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించిందని చెప్పారు. పారిశ్రామిక, ఐటీ రంగంలో పారదర్శక విధానాలు అమలవుతున్నాయని గవర్నర్‌ అన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.

ఈ ఏడాది మార్చి నాటికి మిషన్‌ భగీరథ పూర్తవుతుందని చెప్పారు. ఇటీవలే సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడం సంతోషదాయకమన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా సాగునీటితో పాటు భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. 42 నెలల్లోనే 800 మెగావాట్ల సామర్థ్యంతో కేటీపీఎస్‌ ప్రాజెక్టు పూర్తి చేశామని, సౌరవిద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ నేడు దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. విద్యుత్‌ వినియోగంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం.. అభివృద్ధికి సూచికగా నిలుస్తుందని గవర్నర్ వివరించారు.

‘రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టడం సంతోషదాయకం. ఈ పథకాన్ని దేశంలోని ఆర్థికవేత్తలు, వ్యవసాయవేత్తలు ప్రశంసించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతుబంధు కింద ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇవ్వబోతున్నాం. రైతుబంధు పథకంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రారంభించిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు దేశంలోని పలు రాష్ర్టాలు రైతుబంధు పథకం అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా రైతులకు కొత్త పాసుపుస్తకాలు అందించాం. రైతు సమస్యలపై చర్చల కోసం రైతు వేదికలు నిర్మిస్తున్నాం. రైతుబీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటున్నాం’ అని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.

ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా..

ప్రభుత్వ అవసరాల కోసం చేనేత కార్మికుల నుంచి భారీగా వస్త్రాలు కొనుగోలు చేస్తున్నామని, గద్వాలలో టెక్స్‌టైల్‌ హబ్ నిర్మించే యోచనలో ఉన్నామని గవర్నర్ తెలిపారు. ‘తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల కలలను సాకారం చేశాం. కంటి వెలుగు ద్వారా ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నాం. పరిపాలన, శాంతిభద్రతల విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా జోన్ల సంఖ్య, రిజర్వేషన్లను పెంచాం. ప్రభుత్వ పారదర్శకత వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే కొత్తగా 4వేల పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశాం’ అని గవర్నర్ వివరించారు.

‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌కు తరలి వచ్చాయి. అన్నికాల పింఛన్లను త్వరలోనే రెండింతలు చేస్తున్నాం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఐకేపీ మహిళలకు అప్పగిస్తాం.
దేశానికే ఆదర్శంగా నిలిచేలా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నాం. ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పునాదిగా చేసుకొని తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపి వారికి ఆనందం, సంపద కలిగేలా బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా నా ప్రభుత్వం పునరంకితం అవుతుందని ధృఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను’ అని గవర్నర్ నరసింహన్ తెలిపారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం ఉభయసభలు వాయిదా పడ్డాయి.

- Advertisement -