హైదరాబాద్: సినిమాల్లో పాటలెంత ముఖ్యమో, ఫైట్లు కూడా అంతే అలరిస్తాయి. హీరో స్టయిల్‌కి తగ్గట్టు అద్భుతంగా ఫైట్స్‌ని డిజైన్ చేసి.. ప్రేక్షకులకు వినోదం పంచిపెట్టడంతో బాగా పేరున్న ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు. అయితే వారు అతి త్వరలో సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారట.
మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన రామ్ లక్ష్మణ్.. 1987లో సినీరంగంలోకి అడుగుపెట్టారు. తొలుత చెన్నై వెళ్లిన వీరు 2009 వరకు ఫైట్ మాస్టర్స్‌కి అసిస్టెంట్స్‌గా పని చేశారు. ఇక 2001లో తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్‌కి తరలిరావడంతో వీరు కూడా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు.
గడిచిన 31 ఏళ్ళలో వారిద్దరూ కలిసి 1100పైగా సినిమాలకి ఫైట్ మాస్టర్స్‌గా పనిచేశారు. భారతీయ భాషలకి సంబంధించిన తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ సినిమాలన్నింటికి వీరు పనిచేశారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, గబ్బర్‌సింగ్, ఖైదీనెంబర్ 150 సినిమాలు తమకు గుర్తింపు తెచ్చాయని పేర్కొన్నారు.
త్వరలోనే తాము ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు రామ్ లక్ష్మణ్‌లు ఇద్దరూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాలు మానేసిన తర్వాత పల్లెటూరి వాతావరణంలో జీవనం సాగించాలని తాము కోరుకుంటున్నట్టు వారు పేర్కొన్నారు. అంతేకాదు, తాము పుట్టి పెరిగిన కారంచేడులో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయాలని కైూడా తాము భావిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తోన్న ‘మహర్షి’ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’ చిత్రానికి తాము పనిచేస్తున్నామని చెప్పిన ఈ బ్రదర్స్.. తమకు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటూ ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.