కొండగట్టు బస్సు ప్రమాదం: కారణాలివే, మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్

kondagattu-rtc-bus-accident
- Advertisement -

kondagattu-rtc-bus-accident

జగిత్యాల: జిల్లాలోని కొండగట్టు వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరింది.  మృతుల్లో ఏడుగురు చిన్నారులు, పాతిక మంది మహిళలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 70 మంది వరకు ఉన్నారు.  మృతుల్లో అధికశాతం పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందినవారే.

చదవండి: ఘోర ప్రమాదం: లోయలో పడిన బస్సు, 50 మంది మృతి

ఈ బస్సు ప్రమాదానికి అతివేగం, పైగా డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, రెగ్యులర్ రూట్లో కాకుండా షార్ట్ కట్ రూట్లో రావడం, రోడ్డు డౌన్‌గా ఉండడం, దానికితోడు డ్రైవర్ గేర్‌ను న్యూట్రల్‌లో వేసుకొని నడపడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

ఆ రోడ్డులో స్పీడ్ బ్రేకర్ రావడం, అప్పటికే అమితమైన వేగంతో ఉన్న బస్సు కంట్రోల్ అవక, స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సు పైకి ఎగిరిందని, దీంతో బస్సు అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొని లోయలోకి దూసుకుపోయిందని క్షతగాత్రులు కొందరు చెబుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించేందుకు డ్రైవర్‌ స్టీరింగ్‌ తిప్పడంతోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిందని మరికొందరు చెబుతున్నారు.

ఆ నిమిషం గడిచి ఉంటే…

సాధారణంగా మంగళవారం కొండగట్టు పుణ్యక్షేత్రానికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. రద్దీ నేపథ్యంలో భక్తులు ఆర్టీసీ బస్సులో తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొండపై నుంచి కిందకి వస్తున్న బస్సు మరొక్క నిమిషంలో మెయిన్ రోడ్డుపైకి చేరుకునేదే, కానీ విధి వక్రీకరించింది.. అదే సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్..

కొండగట్టు ప్రమాదంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనాస్థలంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి.

మరోవైపు కొండగట్టు ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

స్థానిక యువత సహాయం…

బస్సు ప్రమాదం జరిగిన వెంటనే సమీప ప్రాంతాల్లోని యువకులు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది సహాయచర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ సింధూశర్మ వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

- Advertisement -