సంచలనం: సమరశంఖం పూరించిన పవన్, ‘జనసేన’ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పితాని బాలకృష్ణ

pitani-balakrishna-pawan-kalyan
- Advertisement -

pitani-balakrishna-pawan-kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంగళవారం సమరశంఖం పూరించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరుపున పోటీ చేయబోయే తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు.  వైసీపీ నుంచి జనసేనలో చేరిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ మాజీ కోఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణను అదే నియోజకవర్గం నుంచి పార్టీ తరుపున పోటీ చేయబోయే తమ అభ్యర్థిగా ప్రకటించారు.

మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ మేరకు వెల్లడించారు. దీంతో జనసేన తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసే తొలి అవకాశాన్ని పొందిన పితాని బాలకృష్ణను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

తనదైన శైలిలో…

ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీని స్థాపించామని ప్రకటించి సంచలనం సృష్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తరువాత క్రమంగా ప్రత్యర్థుల అంచనాలను తలక్రిందులు చేస్తూ రాజకీయ సంగ్రామంలో తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. ‘అజ్ఞాత‌వాసి’ తర్వాత ఇక ఇప్పట్లో సినిమాల్లో నటించనని, రాజకీయ రంగంపైనే దృష్టి పెడుతానని స్పష్టం చేసిన పవన్, చెప్పినట్లుగానే జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘ప్రజాపోరాటయాత్ర’ పేరిట రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలు, సాధక బాధకాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

‘పొలిటికల్ వార్‌’లో బలపడుతూ…

రాజకీయ పార్టీని నడపడం అంత సులువుకాదన్న ప్రత్యర్థుల విమర్శలను జనసేనాని తన అనూహ్యమైన ఎత్తుగడలతో చెల్లాచెదురు చేస్తూ సాగుతుండడం చర్చనీయాంశంగా మారింది.  ‘పొలిటికల్ వార్‌’లో అంతకంతకు బలపడుతూ ప్రత్యర్థుల గుండెల్లో ఆయన రెళ్లు పరిగెత్తిస్తున్నారు. అదే క్రమంలో తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయబోయే తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రకటించి తానూ రెడీగా ఉన్నానంటూ సంకేతాలు ఇచ్చారు.

టిక్కెట్ ఇస్తామని చెప్పి…

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన పితాని బాలకృష్ణ గతంలో ప్రభుత్వ ఉద్యోగి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ టిక్కెట్ ఇస్తానని చెప్పడంతో తన 8 ఏళ్ల ప్రభుత్వ సర్వీసును కూడా కాలదన్ని తాను వైసీపీలో చేరానని, మొదట వైసీపీ ముమ్మిడివరం నియోజకవర్గం పార్టీ కోఆర్డినేటర్ పదవిని ఇచ్చి ఆ తరువాత అర్థాంతరంగా తనను పదవి నుంచి తప్పించి తనను, తన కులాన్ని జగన్ అవమానించారని, అయినప్పటికీ కొంతకాలంపాటు వైసీపీలోనే కొనసాగానని పేర్కొన్నారు.  ఆగష్టు 22న వైసిపికి రాజీనామా చేసి అనంతరం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు  ఆవేదన వ్యక్తం చేశారు.

ఊహించని విధంగా జనసేనలోకి…

పవన్‌కళ్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఎవరూ ఊహించని విధంగా పితాని తన అనుచరగణం సహా జనసేన పార్టీలో చేరారు.  పవన్‌కళ్యాణ్‌ సిద్ధాంతాలు, సేవాకార్యక్రమాల పట్ల ఆకర్షితుడినై తన తన అనుచరులతో చర్చించి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరినట్లు పేర్కొన్నారు.

శెట్టిబలిజ వర్గంలో… 

పితాని బాలకృష్ణ బీసీ సామాజిక వర్గం నేత. ముమ్మడివరం నియోజకవర్గంలోని శెట్టిబలిజల్లో మంచి పేరున్న నాయకుడు. ముమ్మిడివరంలో టిడిపీ, వైసీపీ నేతల కన్నా అధిక ఫాలోయింగ్ ఉన్న పితాని బాలకృష్ణ జనసేనకి బాగా కలిసివస్తారని రాజకీయ పరిశీలకుల భావన.  ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ ఆయనకే తొలి టికెట్ ప్రకటించడం వారి అభిప్రాయాన్ని మరింత బలం చేకూరినట్లయింది.  ఏపీలో జనసేన కచ్చితంగా గెలుపు సాధించే నియోజకవర్గాల్లో ముమ్మిడివరం ఒకటని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 

- Advertisement -