బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సమయంలో చంద్రబాబుకు నచ్చజెబుతున్న మహారాష్ట్ర పోలీసు అధికారి
చంద్రబాబు అరెస్టు దృశ్యం ( ఫైల్ ఫొటోలు )
అమరావతి: షాకింగ్ న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు గురువారం ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. చంద్రబాబు సహా 14 మందిని ఈ నెల 21న కోర్టులో హాజరు పరచాలనేది ఆ అరెస్ట్ వారెంట్ సారాంశం.
చదవండి: తెలంగాణ కోసమే వ్యతిరేకించా, ఎన్నోఇబ్బందులు పెట్టారు, ఆరోజే చెప్పా: అరెస్ట్ వారెంట్‌పై చంద్రబాబు
చదవండి: ఎనిమిదేళ్ల నాటి ఆందోళనకు ఇప్పుడు వారెంటా? ఇది మోడీ మార్కు కుట్రే: సోమిరెడ్డి ఫైర్
2010లో మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తరువాత విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా 14 మందిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఇదంతా ఎనిమిదేళ్ల క్రితం జరగ్గా.. అప్పట్నించి ఒక్క నోటీసు కూడా పంపకుండా ఇప్పుడు ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కనున్నాయి.
శ్రీవారి సేవలో ఉండగా…
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి సేవలో ఉండగా కోర్టు నుంచి నోటీసులు వచ్చినట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో ఆయన న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకేసారి సీఎం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేయడాన్ని తెలుగుదేశం నేతలు తప్పుబడుతున్నారు.
2010లో ఏం జరిగిందంటే…
మహారాష్ట్రలో గోదావరి పై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలు బాబ్లీ సందర్శనకు బయలుదేరారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం, దానికి అనుబంధంగా అనేక ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు చేపట్టడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి, ఉత్తర తెలంగాణా ఎడారిగా మారుతుందని తెలుగుదేశం ఆందోళన చేపట్టింది.
పోలీసుల అమానుషం…
తెలంగాణా సరిహద్దులు దాటి ఈ బృందం మహారాష్ట్రంలోని ధర్మాబాద్‌కు చేరుకున్న వెంటనే అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ తాము బాబ్లీ ప్రాజెక్టును సందర్శించాల్సిందేనని చంద్రబాబు పట్టుబట్టడం, ముందుకు చొచ్చుకు వెళ్లడంతో మహారాష్ట్ర పోలీసులు లాఠీ ఛార్జి కూడా చేశారు. చంద్రబాబు మినహా మిగతా ఎమ్మెల్యేలపై జరిగిన ఆ లాఠీ ఛార్జిలో అనేక మంది గాయపడ్డారు.
ఎనిమిది నెలల క్రితమే…
విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144 సెక్షన్‌ను ఉన్నా పట్టించుకోకపోవడం వంటి వివిధ కారణలతో చంద్రబాబుపై కేసు నమోదయ్యాయి. కోర్టుకు హాజరుకాకపోవడంపై మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం ఎనిమిది నెలల క్రితం చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచీ ఈ వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఇటీవల మహారాష్ట్ర వాసి ఒకరు ఈ నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌ను ఎందుకు అమలు చేయడంలేదంటూ పిటిషన్ కూడా వేశారు.