ఇగోల గిల్లుడు: ‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ

- Advertisement -

sailaja-reddy-alludu-movie

అనగనగా ఓ ఇగోయిస్ట్ పెద్దాయన రావు గారు(మురళిశర్మ). ఆయన కొడుకు చైతు (నాగచైతన్య).  అను(అను ఇమ్మాన్యుయేల్) అనే అందగత్తెని చూసి లవ్ ఎట్  ఫస్ట్ సైట్  అంటాడు.  ట్విస్ట్ ఏమిటంటే ఆమె కూడా ఇగోకు బ్రాండ్ అంబాసిడర్. చైతు ఆమెకు నచ్చినా… తన ఇగో కారణంగా   తన ప్రేమ విషయం చెప్పదు.  చిన్నప్పటి నుంచీ తండ్రి ఇగోని డీల్ చేయటంలో తల పండిన చైతు… మొత్తానికి చిన్న చిన్న కామెడీలు చేసి అనుని మార్చి… అంటే ఆమె ఇగోని ఏమార్చి..విషయం పెళ్లిదాకా తీసుకొస్తాడు.

రావు గారు కూడా .. తనకు కాబోయే కోడలు ఓ యంగ్  ఇగోయిస్ట్ (యంగ్ ఇండస్ట్రియలిస్ట్‌లా) అని… ఆనందంతో బంగీ జంప్ లాంటిది మనస్సులోనే చేసేసి.. వాళ్లిద్దరి పెళ్లికి ఓకే చెప్పేసి ఎంగేజ్‌మెంట్ కూడా జరిపించేస్తాడు.  అయితే ఇక్కడ  మరో ఇగో ఎంటర్ అవుతుంది. ఆమే … అను తల్లి శైలజరెడ్డి (రమ్యకృష్ణ).  ఆమె కూడా మూర్తీభవించిన ఇగో అన్నట్లుగా చెలరేగిపోతూంటుంది.

మరి చైతు ఇంట్లో తన తండ్రి ఇగో, బయట ప్రేమించిన అమ్మాయి ఇగో, తర్వాత కాబోయే అత్తగారి ఇగో లతో ఎలా వేగాడు? ఈ ఇగోలన్నిటిని జయించి… అనుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిన ఇగోయిస్టిక్  కథ.

sailaja-reddy-alludu‘ఇగో’ల ఏంటండీ..

ఈ సినిమా చూస్తూంటే… అసలు ఇంతమంది ఇగో పర్సన్స్ మన హీరోకే తగలటం ఏమిటి… అసలు హీరోలోనే  ఏదన్నా లోపం ఉందా? అనే డౌట్ వస్తుంది. అయితే ఇలాంటి డౌట్స్ వస్తాయనే… దర్శకుడు మారుతి… సినిమా చూసే మన ఇగోని శాటిస్‌ఫై  చేయటానికి వెన్నెల కిషోర్‌తో  అక్కడక్కడా కామెడీని తగిలించాడు. అయితే ఆ కామెడీ పండకపోవటంతో మన ఇగో ఇంకా దెబ్బతింటుంది.  ఇలాంటి సినిమాకు వచ్చేవేంటి అని నిలదీస్తుంది.

‘అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు’ కాలం నాటి కథను ఇగో అనే చట్రంలో పెట్టి హాట్ హాట్ గా అందించాలని మారుతి చేసిన ప్రయత్నం అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి.  ఫస్టాఫ్ ఓకే అనుకుంటే.. సెకండాఫ్ దాని అమ్మాబాబులా ఉంది. అటు రమ్యకృష్ణ ఇగో.. ఇటు అను ఇమ్మాన్యుయేల్ ఇగో…ల మధ్య పోరు.. బోరు కొట్టించేస్తుంది.

పాయింటే తేడాగా ఉండటం, కథలో సరైన మెలిక లేకపోవటంతో సినిమా పెద్ద ఇంట్రస్టింగ్‌గా అనిపించదు.  అన్నిటికి మించి.. శైలజా రెడ్డి అల్లుడు అని టైటిల్ పెట్టి.. ఇంట‌ర్వెల్ దాకా ఆ శైలజా రెడ్డిని పరిచయం చేయకపోవటమే విసుగు అనిపిస్తుంది. కింగ్ కాంగ్ సినిమాకు వెళ్లితే.. ఎక్కడో ఓ గంట గడిచాక కింగ్ కాంగ్ ని చూపెడతానంటే ఎలా? ఏం చూపెడతామని సినిమాకు పిలిచారో.. దాన్ని సాధ్యమైనంత తొందరగా చూపి.. ఆ ప్లే నడపాలి కానీ…

ఈ సినిమాలో నాగచైతన్య ఉషారుగా కనిపించినా, అను ఇమ్మాన్యుయిల్ చాలా అందంగా కనిపించినా, రమ్యకృష్ణ… రాజమాత శివగామిలా కనిపించినా, వెన్నెల కిషోర్ ప్రాణిక్ హీలింగ్ కామెడీ చేసినా ఇగోల మధ్య అవేమీ హైలెట్ కాలేదు. టెక్నికల్ గా బాగున్నా.. ఎమోషన్ లేని సీన్స్, డ్రామా లేని కథ పెద్దగా కలిసిరాలేదు.

ఫైనల్ థాట్..

అత్తా, అల్లుడు మధ్య జరిగే కథలు ఈ మధ్యన రావటంలేదు అని భాధపడే వారికి ఈ సినిమా పెద్ద ఓదార్పు. మిగిలినవారికి ఓదార్పు యాత్ర చెయ్యాల్సిన సినిమా ఇది.

————-

నిర్మాణ సంస్థ: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
తారాగ‌ణం: నాగ‌చైత‌న్య‌, అను ఇమ్మాన్యుయేల్‌, ర‌మ్య‌కృష్ణ‌, సీనియ‌ర్ న‌రేశ్‌, వెన్నెల కిశోర్‌, ర‌ఘుబాబు, ముర‌ళీశర్మ‌, పృథ్వీ, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ త‌దిత‌రులు
సంగీతం: గోపీ సుంద‌ర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: నిజార్ ష‌ఫీ
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
క‌ళ‌: ర‌వీంద‌ర్‌
నిర్మాత‌లు: నాగ‌వంశీ.ఎస్‌, పి.డి.వి.ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: మారుతి

Rating: 2

 

josyula surya prakash

-సూర్యప్రకాష్ జోశ్యుల

- Advertisement -