కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేష్, టీఆర్ఎస్‌కు భూపతిరెడ్డి షాక్!

bandla-ganesh
- Advertisement -

bandla-ganesh

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్  శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.  అంతేకాదు, ఆయన షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశం కూడా లభించినట్లు తెలుస్తోంది.  శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రాహూల్ గాంధీ సమక్షంలో గణేష్ కాంగ్రెస్‌లో చేరారు.

ఈ కార్యక్రమంలో పాల్గోనేందుకు బండ్ల గణేష్‌తోపాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పలువురు సీనియర్ నేతలు గురువారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌తోపాటు ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.

అంతేకాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండ్ల గణేష్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో బండ్ల గణేష్‌కి చెందిన పౌల్ట్రీ వ్యాపారం కూడా ఉంది.  షాద్‌నగర్ ప్రాంతంలో ఆయనకు మంచి సంబంధాలు ఉండడంతో ఆయనకు షాద్‌నగర్ టిక్కెట్టు లభించే అవకాశలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

సేవ చేయాలనే…

కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ..  తనకు చిన్నప్పట్నించి కాంగ్రెస్ పార్టీ  ఇష్టమని, ఆ పార్టీ త్యాగాలకు మారు పేరని, పార్టీ నుంచి తాను ఎలాంటి కమిట్‌మెంట్ అడగలేదని, కేవలం సేవ చేయాలన్న ఉద్దేశంతోనే చేరనని అన్నారు.  ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనకు తండ్రి, గురువు లాంటి వారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

షాక్ ఇచ్చిన భూపతిరెడ్డి…

టీఆర్ఎస్ నేత, నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆ పార్టీకి షాక్ ఇస్తూ.. శుక్రవారం ఢిల్లీలో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై ఆరోపణలు గుప్పించారు.

టీఆర్ఎస్ స్థాపించినప్పట్నించీ తాను అందులోనే ఉన్నానని, కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆ పార్టీ అధినాయకత్వం విఫలమైందని, అసలు తెలంగాణ ఇచ్చిందని సోనియాగాంధీ అని,  అందుకే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైందని భూపతిరెడ్డి దుయ్యబట్టారు.

దూకుడు పెంచిన కాంగ్రెస్…

నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా తన దూకుడు పెంచింది. ఇప్పటికే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరా తీసి, సీనియర్లతో కలిసి చర్చించి, అభ్యర్థుల జాబితా కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ జాబితాను మళ్లీ ఒకసారి వడపోసి, ఫైనల్‌గా ఏఐసీసీ అధ్యక్షుడి ఆమోదముద్ర పడగానే కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పిలుపుతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు దాదాపు 50మంది వరకు గురువారమే ఢిల్లీకి తరలివెళ్లారు. తెెలంగాణలో ముందస్తు ఎన్నికల దృష్ట్యా… పార్టీ పరంగా వివిధ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన నాలుగు రకాల కమిటీలతో పాటు మరో ఇద్దరు వర్కింగ్‌ ప్రసిడెంట్ల నియామకం కూడా త్వరలోనే జరుపనున్నట్లు సమాచారం.

- Advertisement -