హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో తొలుత 20 మందికిపైగా మరణించగా, పలువురు గాయపడ్డారు. అయితే ఆ తరువాత మృతుల సంఖ్య 50కి చేరింది. మరో 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
చదవండి: కొండగట్టు బస్సు ప్రమాదం: కారణాలివే, మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి జగిత్యాలకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బాగా లోతుగా ఉన్న ప్రాంతంలోకి ఆర్టీసీ బస్సు పల్టీలు కొట్టడంతో తుక్కుతుక్కయింది. దీంతో బస్సులో చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఘటనా స్థలంలోనే 25 మంది వరకు మరణించారు. చికిత్స కోసం ఆసుపత్రులకు తరలిస్తుండగా మరికొందరు మరణించారు.
బస్సు ప్రమాదాన్ని గమనించిన భక్తులు, కొందరు స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈలోగా మరికొందరు అధికారులకు సమాచారం అందించారు. బస్సు ప్రమాద వార్త అందిన వెంటనే జగిత్యాల కలెక్టర్, ఎస్పీలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు. 33 మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను జగిత్యాల, కరీంనగర్ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.
బ్రేక్ ఫెయిలే కారణమా?
కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు కిందకు దిగుతున్న సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటుందనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో పరిమితికి మంచి ప్రయాణికులు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. సహాయక చర్యల్లో స్థానికులు నిమగ్నమయ్యారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సు ఒక పక్కకు ఒరిగిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడి ఊపిరి ఆడక పిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో కుటుంబ సభ్యులను పోగట్టుకున్న పలువురు కన్నీరుమున్నీరవుతున్నారు.
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్…
ఈ దుర్ఘటనపై తెలంగాణా ఆపద్ధర్మ ముఖ‍్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
అవసరమైతే క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలిస్తాం: మంత్రి ఈటల
బస్సు ప్రమాదంపై ఆర్థిక శాఖ ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్, ఎస్‌పీ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని క్షతగా,త్రులకు చికిత్స అందించాలని జిల్లాలోని అన్ని ఆసుపత్రులను ఆదేశించామని తెలిపారు. క్షతగాత్రులందరికీ ప్రభుత్వం తరపున వైద్య సహాయం అందిస్తున్నామని, అవసరమైతే బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తామని పేర్కొన్నారు.
చాలా బాధాకరం: రవాణ మంత్రి మహేందర్ రెడ్డి
కొండగట్టు రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని మరో ఆపద్ధర్మ రవాణ మంత్రి మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కొండపై ఇంత పెద్ద ప్రమాదం జరగడం తొలిసారి అన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు, మంత్రి ఈటల రాజేందర్ ప్రమాద స్థలికి చేరుకున్నారని, తాను కూడా బయలుదేరుతున్నానని తెలిపారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్…
కొండగట్టు ఆర్టీసీ ప్రమాదం పట్ల ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.