న్యూఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. చత్తీస్ గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లతోపాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలను నిర్వహించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎటూ తేల్చుకోలేకపోతోంది. తెలంగాణకు ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశాలను ఇప్పుడే చెప్పలేమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) ఓపీ రావత్ తెలిపారు.
జూన్ 2019 వరకూ అసెంబ్లీకి గడువు ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు విముఖత చూపుతూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేశారు. అసెంబ్లీని రద్దు చేస్తూ గురువారం రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు అందజేయడం, దానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్ నరసింహన్ తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకూ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కేసీఆర్‌ను కోరడం తెలిసిందే.
కేసీఆర్ ప్రకటనపై దుమారం…
తెలంగాణ అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ లో ఫలితాలు వెలువడతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఎన్నికలు ఎప్పుడొస్తాయో కూడా కేసీఆరే చెప్పేస్తారా? అంటూ విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఈసీని కలిసిన సీపీఐ నేతలు…
ఈ నేపథ్యంలో సీఈసీ ఓపీ రావత్‌తో సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణలు శుక్రవారం భేటీ అయ్యారు. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకు కూడా ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ ప్రకటించడంపై వీరు అభ్యంతరం వ్యక్యం చేశారు. దీనిపై సీఈసీ ఓపీ రావత్ స్పందిస్తూ.. కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి వ్యాఖ్యానించినట్టు తాను మీడియాలో చూశానని, ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం కాకుండా ఇతరులు ప్రకటించడం తప్పని అన్నారు. అసెంబ్లీలోకాని, ఇతర సభలోకాని రాజకీయ నాయకులు ఎన్నికల తేదీలను ప్రకటించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
వారం రోజుల్లో ఈసీ నిర్ణయం…
ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ మాట్లాడుతూ.. వారం రోజుల్లో తెలంగాణ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని, అయితే మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని రావత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నుంచి నివేదిక వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలను నిర్వహించేందుకు యంత్రాంగం, వసతులు, ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉంటే… ముందుగా నిర్వహించేందుకు తమకు ఎలాంటి సమస్య లేదని తెలిపారు.
నేటి ఈసీ భేటీలోనూ చర్చ…
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై శుక్రవారం జరిగే భేటీలో ఎన్నికల కమిషన్ (ఈసీ) చర్చించనుంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలా లేక మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలా? అనే అంశంపై ఈసీ కసరత్తు సాగించనుంది.
ఈసీ ప్రతి మంగళవారం, శుక్రవారం సమావేశం అవుతుంది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ రద్దు అనంతర పరిణామాలు, ఎన్నికల నిర్వహణపై నేటి సమావేశంలో చర్చకు రావచ్చని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. తుది నిర్ణయం తీసుకునే ముందు పండుగలు, పరీక్షలు, వాతావరణం వంటి పలు అంశాలను ఈసీ బేరీజు వేస్తుందని చెప్పారు.