బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం బెంగళూరు బుల్స్ మరోసారి జోరు చూపించి జైపుర్ పింక్ పాంథర్స్ పై ఘనవిజయం సాధించింది. దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 45-32 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్ పై నెగ్గింది.
చెలరేగిన పవన్ సెహ్రావత్…
బెంగళూరు బుల్స్ జట్టు రైడర్ పవన్ సెహ్రావత్ ఏకంగా 19 పాయింట్లతో చెలరేగిపోవడం విశేషం. ఇంకా ఈ జట్టులో మహేందర్ 5 పాయింట్లు, కాశీలింగ్ 5, రోహిత్ 3 పాయిట్లతో రాణించారు. రోహిత్ కుమార్ కూడా రెండు సూపర్ రైడ్లతో తన సత్తా చాటాడు.
మొదటి అర్ధభాగం ఆట పూర్తయ్యే సమయనికి బెంగళూరు బుల్స్ 17-18 స్కోరుతో వెనుకబడటం గమనార్హం. అయితే పవన్ సెహ్రావత్ రైడింగ్‌లో దుమ్మురేపడంతో ప్రో కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్ జట్టు తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది.
అయితే ఆట రెండవ అర్ధభాగంలో బెంగళూరు బుల్స్ జట్టు ఆటగాళ్లు చెలరేగిపోయి ఆడి ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసి 34వ నిమిషానికే 37-24 స్కోరుతో విజయం ఖరారు చేసుకున్నారు.
జైపుర్ పింక్ పాంథర్స్ జట్టులో దీపక్ హుడా ఒక్కడే 11 పాయింట్లతో మెరిశాడు. ఇంకా అజింక్యా 7 పాయింట్లు, సందీప్ 3 పాయిట్లతో ఓ మోస్తరుగా ఆడారు.
మరో మ్యాచ్‌లో యూపీ యోధాపై..
ప్రో కబడ్డీ లీగ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 37-32 స్కోరుతో యూపీ యోధాపై నెగ్గింది. గుజరాత్ జట్టులో సచిన్ 8 పాయింట్లతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ప్రత్యర్థి జట్టులో యూపీ యోధా తరుపున శ్రీకాంత్ జాదవ్ 11 పాయింట్లు సాధించాడు.
గుజరాత్ తరఫున సచిన్ 8 పాయింట్లు, సునీల్ 5 పాయింట్లు, రుత్‌రాజ్ 4 పాయింట్లతో రాణించగా, యూపీ యోధా జట్టు తరుపున శ్రీకాంత్ 11 పాయిట్లు, నితేశ్ 5 పాయిట్లు, జీవా 4 పాయింట్లు అందించినా ప్రయోజనం లేకపోయింది.