బెంగళూరు: వీవో ప్రో కబడ్డీ సీజన్ 7లో ఆదివారం యూపీ యోధా జట్టు అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానాన్ని ఆక్రమించిన బెంగాల్ వారియర్స్‌పై ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరికి యూపీ యోధా పైచేయి సాధించింది.
బెంగాల్ వారియర్స్ జట్టు ఆటగాళ్ళు కూడా చివరివరకు పోరాడారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు. కేవలం 3 పాయింట్ల తేడాతో యూపీ యోధా విజయం సాధించింది. యూపీ యోధా జట్టు స్టార్ రైడర్ శ్రీకాంత్ జాదవ్ 9 పాయింట్లతో ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ట్యాకిల్స్‌లో రాణించి…
నీతేశ్ కుమార్ కూడా 7 పాయింట్లు సాధించి ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో సుమిత్ 4, అషు 2, అమిత్ 2, సురేందర్ 2, అంకుశ్ 2 పాయింట్లతో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇలా యూపీ యోధా జట్టు రైడింగ్‌లో 12 పాయింట్లు, ట్యాకిల్స్‌లో 16 పాయింట్లు సాధించింది.
అంతేకాకుండా బెంగాల్ వారియర్స్ జట్టును ఆలౌట్లు చేయడం ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 2 పాయింట్లు సాధించి.. మొత్తం మీద 32 పాయింట్లతో విజయాన్ని అందుకుంది.
ఇక బెంగాల్ వారియర్స్ జట్టు విషయానికి వస్తే… రైడింగ్‌లో 15 పాయింట్లతో యూపీ యోధా జట్టుపై పైచేయి సాధించినా.. ట్యాకిల్స్‌లో మాత్రం వారియర్స్ వెనుకబడింది. ఈ విభాగంలో కేవలం 12 పాయింట్లు మాత్రమే సాధించి వెనుబడింది. అంతేకాదు, ఒక్కసారి కూడా ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయలేకపోయింది.
3 పాయింట్లు వెనుకబడి…
ఎక్స్‌ట్రాల రూపంలో 2 పాయింట్లు సాధించి మొత్తంగా 29 పాయింట్లకు చేరుకుంది. అయినా సరే యూపీ యోధా జట్టుకంటే వారియర్స్ జట్టు మూడు పాయింట్లు వెనుకబడింది.
బెంగాల్ వారియర్స్ జట్టు ఆటగాళ్లలో ఇస్మాయిల్ 7, బల్‌దేవ్ 5, ప్రపంజన్ 4 పాయింట్లతో రాణించారు. మణీందర్ సింగ్ 3, రింకు 3, మయూర్ 2, సుఖేష్ 2 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ ఆటగాళ్లు తమ జట్టును గెలిపించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు కానీ 32-29 తేడాతో చివరికి పరాజయం పాలవక తప్పలేదు.