అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 2018 సీజన్-6లో పాట్నా పైరేట్స్ ఏడో విజయం.. వరుసగా నాలుగో విజయం సాధించింది. బుధవారం పాట్నా పైరేట్స్ జట్టు 45-27 స్కోరుతో తమిళ్ తలైవాస్‌ను చిత్తుగా ఓడించింది.
చెలరేగిన ‘డుబ్కీ’ కింగ్…
పాట్నా పైరేట్స్ జట్టులో డుబ్కీ’కింగ్ ప్రదీప్ నర్వాల్(13 పాయింట్లు) చెలరేగి ఆడడం, మరోవైపు దీపక్ నర్వాల్ 10 రైడ్ పాయింట్లు సాధించగా.. మంజీత్ చిల్లర్ 5 రైడ్ పాయింట్లు, 3 టాకిల్ పాయింట్లతో అదరగొట్టడం పాట్నాకు బాగా కలిసొచ్చింది.
ఆట తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పాట్నా పైరేట్స్ జట్టు 16-13 స్కోరుతో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ 8 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
స్కోర్ బోర్డులో చూస్తే.. పాట్నా పైరేట్స్ మొత్తం 38 పాయింట్లతో జోన్-బిలో అగ్రస్థానంలో ఉండగా.. తమిళ్ తలైవాస్ 25 పాయింట్లతో అట్టడుగున ఉంది.
మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ గెలుపు..
ప్రో కబడ్డీ లీగ్‌లో హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 39-35 స్కోరుతో యు ముంబా జట్టుపై విజయం సాధించింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టులో ప్రపంజన్ 10 పాయింట్లు, యు ముంబా జట్టులో సిద్ధార్థ్ దేశాయ్ 13 పాయింట్లతో ఆకట్టుకున్నారు.
చివరి 37వ నిమిషంలో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఆటగాడు మహేంద్ర రాజ్‌పుత్ రైడింగ్‌లో రెండు పాయింట్లు సాధించుకొని రావడంతో ఒక్కసారిగా మ్యాచ్ తీరే మారిపోయింది. దీంతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్.. యు ముంబాపై 34-32 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది.
ఆ తరువాత మళ్లీ ఒకసారి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తన ప్రత్యర్థి జట్టుని ఆల్ అవుట్ చేయడంతో స్కోరు 37-32 పాయింట్లకు పెరిగింది. ఈ దశలో.. అంటే 40వ నిమిషంలో ప్రపంజన్ మరో రెండు పాయింట్లు సాధించుకురావడంతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు.. యు ముంబాపై 39-35 స్కోరుతో విజయం సాధించింది.
ప్రో కబడ్డీ లీగ్‌లో గురువారం రాత్రి జరిగే మ్యాచ్…
హర్యానా స్టీలర్స్ Vs గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్