విశాఖపట్నం: కోర్టులో తనకు 14 సంవత్సరాలు జైలు శిక్ష పడటాన్ని తట్టుకోలేని ఓ ఖైదీ జడ్జి మందే తన గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఉదంతమిది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని రోలుగుంట మండలానికి చెందిన రాజాన అప్పలనాయుడు కొందరితో కలిసి 2016లో కారులో గంజాయిని తరలిస్తూ మాకవరపాలెం మండలం పైడిపాల వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు.
దీంతో పోలీసులు దాదాపు 74 ప్యాకెట్లలో ఉన్న రూ.7 లక్షల విలువైన 148 కేజీల గంజాయిని సీజ్ చేసి.. అప్పలనాయుడు సహా ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈ క్రమంలో విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వీరందరిని తుది విచారణలో భాగంగా సోమవారం విశాఖపట్నం మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి వీరిని దోషులుగా నిర్థారించి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
జడ్జిమెంట్ వినగానే…
న్యాయమూర్తి వెలువరించిన జడ్జిమెంట్ వినగానే షాక్‌కు గురైన అప్పలనాయుడు వెంటనే జేబులోంచి పేపర్ కటింగ్ చేసే కత్తితో కోర్టులోనే తన గొంతు కోసేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
కోర్టులోనే అనూహ్యంగా ఈ సంఘటన జరగడంతో న్యాయమూర్తి, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులు అందరు నిర్ఘాంతపోయారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అప్పలనాయుడుని కింగ్ జార్జ్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అప్పలనాయుడు పరిస్ధితి నిలకడగానే ఉందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు.