కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ కార్యాచరణను ఉద్ధృతం చేసిన సంగతి తెలిసిందే. అటు అధికార పక్షాన్నే కాకుండా ఇటు ప్రతిపక్షమైన వైసీపీపై కూడా ఆయన తూటాల్లాంటి మాటలతో ఘటు విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే అంశంపై రాష్ట్రంలో సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ప్రశ్నకు జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు ముత్తా గోపాలకృష్ణ క్లారిటీ ఇచ్చేలా మాట్లాడారు.
క్లారిటీ ఇచ్చిన ముత్తా గోపాలకృష్ణ…
కాకినాడలో ముత్తా గోపాలకృష్ణ ఈ అంశంపై మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే తూర్పుగోదావరి జిల్లా నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని తెలిపారు. జిల్లాలోని కాకినాడ సిటీ లేదా కాకినాడ రూరల్, పిఠాపురం స్థానాల్లో ఏదైనా ఒక చోట నుంచి ఆయన పోటీ చేస్తారని వెల్లడించారు.
పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా… ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు జన సైనికులు సిద్ధంగా ఉన్నారని ముత్తా గోపాలకృష్ణ చెప్పారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ ఆశయాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు.