తెలంగాణలో.. రాహుల్‌తో కలిసి చంద్రబాబు ప్రచారం! రెండు బహిరంగ సభల్లోనూ పాల్గొనే అవకాశం?

chandrababu
- Advertisement -

chandrababu

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయమే లక్ష్యంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు.. టికెట్ ఆశించి భంగపడిన నేతలను పిలిచి బుజ్జగించారు.

కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో జట్టుకట్టిన చంద్రబాబు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించేందుకు కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనుండటం విశేషం. నవంబర్ 29, 30వ తేదీల్లో చంద్రబాబు.. రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

మహాకూటమి అభిమానుల ఓట్లే లక్ష్యంగా…

కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, సీపీఐలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి.. టీడీపీ 13స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో నివాసముంటున్న ఏపీ ప్రజలతోపాటు టీడీపీ, మహాకూటమి అభిమానుల ఓట్లే లక్ష్యంగా చంద్రబాబు తన ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీతోపాటు రెండు బహిరంగ సభల్లోనూ చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థుల తరపున కూడా పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో తమ అభ్యర్థుల గెలుపు మరింత సులభమవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

మరో వైపు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనుండటంతో రాజకీయ ప్రచారం మరింత వేడెక్కనుంది.

- Advertisement -