‘ఫైర్‌ఫ్లై’ తొలి ప్రయోగమే విఫలం! గగనానికి ఎగిసిన కొద్దిసేపటికే.. కుప్పకూలిన రాకెట్… (వీడియో)

- Advertisement -

వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాలు ఆషామాషీ కాదు. ఎంతో ఖర్చు, వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ‘నాసా’ వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థకే ప్రతి ప్రయోగం ఒక సవాల్.

ఇక ఈ రంగంలో ప్రైవేటు సంస్థలు జొరబడితే.. విజయాలకన్నా అపజయాలు మూటగట్టుకోవడమే అధికమవుతుంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ సంస్థ సైతం ఎన్నో ఢక్కామొక్కీలు తిని ఇప్పుడిప్పుడే విజయాలు అందుకుంటోంది.

దీంతో మరిన్ని ప్రైవేటు సంస్థలు ‘స్పేస్ ఎక్స్’ బాటలో పయనించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. కొన్ని సంస్థలు అప్పుడే అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమైపోయాయి.

అయితే తాజాగా మరో ప్రైవేటు సంస్థ ‘ఫైర్‌ఫ్లై’ చేపట్టిన తొలి రాకెట్ ప్రయోగం విఫలమైంది. సెప్టెంబర్ 2న (గురువారం) ఈ సంస్థ ప్రయోగించిన ‘ఆల్ఫా’ రాకెట్ నింగికి ఎగసిన కొద్దిక్షణాలకే పేలిపోయింది.

ఇంజినులో సాంకేతిక లోపం…

లాంచ్ చేసిన రెండు నిమిషాలకే రాకెట్‌కు సంబంధించిన ఇంజిన్లలో ఒకదానిలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అదుపు తప్పిన రాకెట్ నిర్దేశిత మార్గం నుంచి పక్కకుపోయి ఆకాశంలోనే పేలిపోయింది.

తన మొట్టమొదటి రాకెట్ ప్రయోగం విఫలమవడానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషిస్తూ ‘ఫైర్‌ఫ్లై’ సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఆల్ఫా రాకెట్‌‌ను భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టలేక పోయినప్పటికీ, రాకెట్లను నిర్మించి, ప్రయోగించగల కంపెనీగా ‘ఫైర్‌ఫ్లై’ తన సత్తాను నిరూపించిందని కంపెనీ పేర్కొంది.

అంతేకాదు, భవిష్యత్తులో మరిన్ని రాకెట్ ప్రయోగాలు చేపట్టగలమనే నమ్మకం తమలో ఏర్పడిందని ‘ఫైర్‌ఫ్లై’ తాను విడుదల చేసిన ఆ ప్రకటనలో వివరించింది.

 

- Advertisement -