

యూఏఈ: సంపాదనపై మక్కువతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లేవారు ఎందరో. అలాగే ప్రపంచం నలుమూలల నుంచి యూఏఈకి వెళ్లి స్థిరపడిన వారు కూడా చాలా మందే ఉన్నారు. వీరంతా అక్కడే ఉద్యోగాలు చేస్తూ.. తమ పిల్లలను కూడా అదే చోట చదివిస్తున్నారు. అయితే వీరందరూ ఎంప్లాయిమెంట్ వీసాతో ఆయా దేశాల్లో నివసిస్తున్నారు. అంటే ఉద్యోగం చేస్తున్నంత వరకు వీరికి ఆయా దేశాల్లో ఉండటానికి హక్కుంది.
ఒకవేళ వీరి ఉద్యోగం మధ్యలో పోతే? లేదా కంపెనీ మూసేసి వేరే ఉద్యోగం చూసుకోమని యాజమాన్యం చెబితే? అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు, వాళ్లపై ఆధారపడి ఆయా దేశాల్లో ఉంటోన్న వారి పిల్లలు ఏం చేయాలి..? తిరిగి స్వదేశానికి వచ్చేయాల్సిందేనా..? అక్కడ ఉండటానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా..?
రెసిడెంట్ వీసాతో 2 ఏళ్లు ఉండొచ్చు…
ఉన్నాయనే చెబుతున్నారు అక్కడి అధికారులు. దుబాయ్‌లో ఉద్యోగం పోయినా రెసిడెంట్ వీసాతో రెండేళ్లపాటు అక్కడే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వీసాను పొందాలంటే 10 లక్షల దిర్హామ్(దాదాపుగా రెండు కోట్లు)ల విలువ గల ఇల్లు లేదా ఇళ్లు సొంతమై ఉండాలి.
అలా సొంతిళ్లు ఉన్న వారు మాత్రమే హఠాత్తుగా ఉద్యోగం పోయినా అక్కడ ఉండే అవకాశం ఉంది. వీరుతమ ఒరిజినల్ పాస్‌పోర్టు, ఆ ఇళ్లను అమ్మిన డెవలపర్ నుంచి ఎన్‌ఓసీ, ప్రస్తుతం ఏ వీసాపై అక్కడ ఉంటున్నారో ఆ వీసా మొదటి పేజీ కాపీని తీసుకుని దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ అధికారులను కలవాలి.
అన్ని పత్రాలు సరిగా ఉన్నట్టు అక్కడి అధికారులు నిర్ధారిస్తే ఆ తరువాత దుబాయ్ పోలీస్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం దుబాయ్ ఎకనామిక్ డిపార్ట్‌మెంట్ అధికారులకు కూడా ఆ పత్రాలు సమర్పించి ఇన్వెస్టర్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెనర్స్ అఫైర్స్ ఇన్ దుబాయ్(డీఎన్‌ఆర్‌డీ) అధికారులను కలిసి రెసిడెన్స్ వీసా కోసం అప్లై చేసుకోవాలి.
వారు ఆ వీసాను మంజూరు చేస్తే.. స్వదేశానికి తిరిగి రాకుండా రెండేళ్ల పాటు దుబాయ్‌లోనే ఉండొచ్చు. ఆ రెండేళ్లలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుని తిరిగి ఎంప్లాయ్‌మెంట్ వీసాపై అక్కడే ఉండొచ్చు.








