27.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం పీఎన్‌బీ స్కాం: భారత పౌరసత్వాన్ని వదులుకున్న మెహుల్ ఛోక్సీ, ఇక అక్కడే..

పీఎన్‌బీ స్కాం: భారత పౌరసత్వాన్ని వదులుకున్న మెహుల్ ఛోక్సీ, ఇక అక్కడే..

mehul choksi
- Advertisement -

mehul choksi

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో కీలక నిందితుడు, దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. తన భారత పాస్‌పోర్ట్‌ను ఆంటిగ్వాలో అధికారులకు అప్పగించారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో భారత్‌లో దర్యాప్తు సంస్థలు ఆయనపై విచారణ జరుపుతున్నాయి. దీంతో తనను భారత్‌కు రప్పించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఛోక్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంటిగ్వాలోని భారత హైకమిషన్‌లో ఛోక్సీ తన పాస్‌పోర్ట్‌ను, 177డాలర్లను అందజేశారు.

పీఎన్‌బీలో మోసాలకు పాల్పడిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ, ఆయన మామ మెహుల్‌ ఛోక్సీలు భారత్‌ విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఛోక్సీకి అంటిగ్వా పౌరసత్వం కూడా ఉంది.

దాదాపు ఏడాదిగా అంటిగ్వాలో ఉంటున్న ఛోక్సీ.. గడచిన డిసెంబర్ 25న కోర్టు విచారణకు హాజరై, తాను ఇండియాకు వెళ్లలేనని, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 41 గంటల పాటు ప్రయాణించలేనని చెప్పిన వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుకోవచ్చని ఆయన తెలిపారు.

ఛోక్సీకి రెండు దేశాల పౌరసత్వం…

కాగా, ఛోక్సీకి రెండు దేశాల(భారత్, అంటిగ్వా) పౌరసత్వాలు ఉండడానికి వీల్లేదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. దీంతో ఛోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. మెహుల్‌కు 2017లోనే ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం లభించింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో నీరవ్ మోడీ, ఛోక్సీలు దాదాపు రూ.13వేల కోట్ల మోసానికి పాల్పడ్డారు. వీరిపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద వారిని భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.

చోక్సీ భారత పౌరసత్వాన్ని వదులుకోవడంతో స్వదేశానికి రప్పించడం కొంత కష్టతరంగా మారనుంది. ఇండియాలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, ఆపై పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీ తదితరులను ఎలాగైనా వెనక్కు రప్పిస్తామని.. వారిని చట్టం ముందు నిలుపుతామని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

- Advertisement -