- Advertisement -
అబుదాబి: ఓ భారతీయుడిని ఊహించని విధంగా అదృష్టం వరించింది. దీంతో రాత్రికి రాత్రే అతడి తలరాత మారిపోయింది. భారత్‌కు చెందిన డిక్సన్ కత్తితర అబ్రహాం కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాడు. నైజీరియా వెళ్తున్న అబ్రహాం అబుదాబి ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో కొనుగోలు చేసిన ఓ లాటరీ టిక్కెట్ అతడ్ని సంపన్నవంతుడిగా మార్చేసింది.
‘బిగ్ టికెట్ అబుదాబి’ లాటరీలో అతడు కొనుగోలు చేసిన టిక్కెట్‌కు అక్షరాలా 10 మిలియన్ దిర్హమ్‌లు వచ్చిపడ్డాయి. అంటే భారతీయ కరెన్సీలో రూ. 18 కోట్లకు పైమాటే. అబ్రహాం కొనుగోలు చేసిన 012027 నెంబర్ టికెట్‌కు లాటరీ దక్కినట్లు నిర్వాహకులు ఆదివారం అబుదాబి ఎయిర్‌పోర్టులో లక్కీ డ్రాను నిర్వహించిన అనంతరం ప్రకటించారు. దీంతో డిక్సన్ కత్తితర అబ్రహాం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అబ్రహాంతోపాటు భారత్‌కు చెందిన మరో ఐదుగురిని కూడా అదృష్టం వరించింది. వీరంతా 30 వేల నుంచి లక్ష దిర్హమ్‌ల లాటరీలను గెలుచుకున్నారు. మొత్తం 10 మంది విజేతల్లో పాకిస్తాన్‌కు చెందిన వారు ముగ్గురు కాగా యూఏఈకి చెందిన వ్యక్తి ఒకరున్నారని నిర్వాహకులు వెల్లడించారు.
- Advertisement -