టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్! కోమటిరెడ్డి, సంపత్‌లపై పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు!!

- Advertisement -

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. వారి శాసన సభ్యత్వాలు రద్దు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ విచారణకు స్వీకరించవచ్చా లేదా అనే అంశంపై వేసవి సెలవులకు ముందే వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం.. సోమవారం తీర్పునిచ్చింది.

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుతగిలి గందరగోళం సృష్టించారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రెండు జీవోలు కూడా విడుదలయ్యాయి. ఈ అంశంపై న్యాయం కోసం హైకోర్టు తలుపుతట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లపై విధించిన నిషేధం చెల్లదని, వారి సభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. శాసనసభలో ఆ ఘటన జరిగిన సమయంలో తామూ సభలోనే ఉన్నామని.. కాబట్టి తమ వాంగూల్మాలను పరిగణనలోకి తీసుకుని వారిపై నిషేధాన్ని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పిటిషన్‌లో అభ్యర్థించారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ పిటిషన్‌‌ను విచారణకు స్వీకరించాలా, లేదా అనే అంశంపై హైకోర్టు వాదనలు వింది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్‌ తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాత్రమే ఉన్నందున వారి అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకోవాలని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని కాంగ్రెస్‌ తరపు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదంటూ సోమవారం కొట్టివేసింది.

- Advertisement -