హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు 45వ పుట్టిన రోజు వేడుకలు ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్‌లో ఘనంగా నిర్వహించారు. ఆయన తన తల్లి లక్ష్మి ఆశీర్వాదం తీసుకున్నారు. వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతర శ్రామికుడు, ప్రభావంతమైన వ్యక్తి మంత్రి హరీష్ సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. హరీష్ పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులు, తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హరీష్ రావు జన్మదినం నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు మినిస్టర్స్ క్వార్టర్ వద్దకు తరలి వచ్చారు. కేకులు, పూల బోకేలతో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరి కొందరు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు పాఠశాల పిల్లలు కూడా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరిని ఓపికతో కలుస్తూ వారి అభినందనలు స్వీకరించారు. సెల్ఫీలు అడిగిన వారితో ఫోటోలు దిగారు.
ఉపముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి, జగదీష్ రెడ్డి, ఈటెల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలు మంత్రి హరీష్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు అబిమానులు ఆయన ఇంటి వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మధ్యాహ్నం ఆయనను కలిసేందుకు ఓ దివ్యాంగురాలు వచ్చారు. జన సందోహం వల్ల కలవలేకపోయారు. కాసేపటికి దుబ్బాకలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కారు ఎక్కిన హరీష్ రావుకు విషయం తెలిసి కారు దిగి వచ్చి ఆమెను పలుకరించారు. ఆమె తన సమస్యను చెప్పడంతో సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
పూరీలో హరీష్ రావు పేరిట పూజలు…
తెలంగాణ ఉద్యమ కారుడు, ఉద్యమ సమితి అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఒడిషాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో హరీశ్ రావు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులతో ఆలయానికి కొంతదూరంలో ఉన్న సముద్రం పక్కనే సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీయ, సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించడంలో తనవంతు పాత్ర పోషిస్తూ తెలంగాణలో ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయడంలో అహర్నిశలు కష్టపడుతున్న హరీశ్ రావు పుట్టిన రోజును పురస్కరించుకుని సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.