దుబాయ్: ప్రవాస భారతీయులు గల్ఫ్ దేశాల వ్యాపార, వాణిజ్య రంగాల్లోనూ తమ సత్తా చూపిస్తున్నారు. అక్కడి వ్యాపార, వాణిజ్య రంగాల్లో సత్తా చాటిన వంద మందికిపైగా భారతీయుల జాబితాను ఫోర్బ్ప్ పత్రిక ‘టాప్ 100 ఇండియన్ లీడర్స్ ఇన్ ది అరబ్ వరల్డ్’ పేరుతో ప్రచురించింది. ప్రస్తుతం వీరి నికర ఆస్తుల విలువ 264 కోట్ల డాలర్లు. ప్రస్తుత డాలర్-రూపాయి మారకం రేటు ప్రకారం ఇది దాదాపు రూ.17,952 కోట్లకు సమానం.
ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఉండే యూసఫ్ ఆలీ ఎంఎ, బిఆర్ షెట్టి, రవి పిళ్లై అనే వ్యాపారవేత్తల ఆస్తుల విలువే 1,200 కోట్ల డాలర్లు. 500 కోట్ల డాలర్ల ఆస్తులతో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ అధినేత యూసఫ్ ఆలీ ఎంఎ మొదటి స్థానంలో ఉన్నారు. 3.6 బిలియన్ డాలర్లతో బీఆర్ శెట్టి, 3.5 బిలియన్ డాలర్లతో రవి పిళ్లై వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ప్రస్తుతం గల్ఫ్ దేశాల వ్యాపార, వాణిజ్య రంగాల్లో దూసుకు పోతున్న అనేక మంది ప్రవాస భారతీయులు ఇపుడు దేశ, విదేశాల్లోనూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. వీరిలో కొందరు గల్ఫ్ దేశాల్లో చమురు నిక్షేపాలు బయట పడక ముందే అక్కడికి వచ్చి వ్యాపారం ప్రారంభించారని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.