ఆసుపత్రి పాలైన ట్రంప్ భార్య, ఏం జరిగిందంటే…

- Advertisement -

వాషింగ్టన్: అమెరికా ప్రథమ మహిళ, డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ హఠాత్తుగా ఆసుపత్రి పాలయ్యారు. ‘ ఆమె కిడ్నీలో ఓ కణితిని గుర్తించిన వైద్యులు వెంటనే అవసరమైన శస్త్ర చికిత్స అందించారు.  వాషింగ్టన్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ఎంబొలిజైషన్ విధానం ద్వారా ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించి ఆ కణితిని తొలగించారు.

అనంతరం ప్రథమ మహిళ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని, మెలానియా ఆరోగ్యం నిలకడగా ఉందని కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టేఫానీ గ్రిషం తెలిపారు. స్టేఫానీ ప్రకటన అనంతరం శ్వేతసౌధం అధికారులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.

మెలానియా పూర్తిగా కోలుకునేంత వరకూ ఓ వారంపాటు ఆమె ఆసుపత్రిలోనే  ఉండనున్నారని ఆ ప్రకటనలో పేరకొన్నారు.  మరోవైపు అమెరికా ప్రథమ పౌరుడు డొనాల్డ్ ట్రంప్ ఆసుపత్రిలో ఉన్న తన భార్యను చూసేందుకు వెళ్లారు.  వెళ్లేముందు.. ‘మెలానియాను చూడడానికి వెళ్తున్నాను..’ అంటూ అధ్యక్షుడు ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. ఎంబోలిజైషన్ విధానం చాలా తరచుగా కణితిని వేరుచేయడానికి ఉపయోగిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెలానియా ట్రంప్‌కు  చికిత్స నిర్వహించిన వైద్యులు తెలిపారు.

- Advertisement -