బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజారిటీని మాత్రం చేరుకోలేకపోయింది. 103 స్థానాలు గెలుపొందిన ఆ పార్టీకి షాక్ ఇస్తూ.. అనూహ్యంగా కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం తెరపైకి వచ్చింది. జేడీఎస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం.. ఆ రెండు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరడంతో కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మరోవైపు మ్యాజిక్ ఫిగర్‌కు 9 స్థానాల దూరంలో ఉన్న యడ్యూరప్ప సైతం గవర్నర్‌ను కలిసి తమకు మొదట అవకాశం కల్పించాలని, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలుపుకొని.. మెజారిటీ సభ్యుల మద్దతు తమకు ఉందని కోరారు. దీంతో గవర్నర్ ఎవరికి ముందుగా అవకాశం ఇస్తారు? ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది ఆకస్తికరంగా మారింది.
గతంలో ఎన్నడూలేని విధంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అత్యంతవేగంతో పావులు కదిపింది. ఫలితాలు పూర్తిగా వెలువరించకముందే.. బీజేపీకి అధికారం దక్కకుండా వ్యూహాన్ని ఖరారు చేసి.. వెంటనే అమలు చేసింది. తాము రెండోస్థానంలో ఉన్నప్పటికీ.. మూడోస్థానంలో ఉన్న జేడీఎస్‌కు మద్దతు ప్రకటించి.. జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ముగ్గురు ముఖ్యమంత్రుల ఫోన్‌కాల్స్ చలువ కూడా ఉందని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ వెలువడుతున్న సమయంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ సోనియాగాంధీకి ఫోన్ చేసి ఆమెను అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా సోనియాకు ఫోన్‌చేసి.. చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. గతంలో గోవా తరహాలో ఆలస్యం చేసి.. మరోసారి బీజేపీకి అవకాశం కల్పించవద్దని.. చురుగ్గా, వేగంగా పావులు కదిపి.. బీజేపీని నిలువరించాలని ఈ ముగ్గురు సీఎంలు సోనియాకు సూచించినట్టు తెలుస్తోంది.
మొత్తానికి కర్ణాటక ఫలితాలను వేగంగా విశ్లేషించి.. కాంగ్రెస్ చురుగ్గా పావులు కదపడం వల్ల ఇప్పుడు.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌లోని ఐదుగురు లింగాయత్ ఎమ్మెల్యేలు, జేడీఎస్‌లోని హెచ్‌డీ రేవణ్ణ వర్గం బీజేపీ తమవైపు తిప్పుకునే అవకాశముందని వార్తలు వస్తుండటం కాంగ్రెస్-జేడీఎస్‌లో కలవరం రేపుతోంది.