రష్యాలో భువనగిరి మెడికో మృతి, డాక్టర్ పట్టాతో నెల రోజుల్లో వస్తాడనుకుంటే..

medico-naveen
- Advertisement -
medico-naveenహైదరాబాద్:  రష్యాలోని ఓరన్‌ బర్గ్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న భువనగిరికి చెందిన గజ్జ నవీన్(23)  ప్రమాదవశాత్తు మరణించాడు.  తన బర్త్ డే వేడుకల్లో భాగంగా శుక్రవారం స్నేహితులతో కలిసి ఓ సరస్సులో ఈత కొట్టేందుకు వెళ్లిన నవీన్ కాలు జారడంతో నీటిలో మునిగి చనిపోయాడు.  నవీన్ మృతదేహం రష్యా రాజధాని మాస్కో విమానాశ్రయానికి చేరింది.  అతడి మృతదేహాన్ని భారతదేశానికి పంపించేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను అక్కడి అధికారులు పూర్తి చేసే పనిలో ఉన్నారు.
నవీన్‌ మృతదేహాన్ని త్వరగా రప్పించేందుకు భువనగిరి లోకసభ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్‌ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారు. దీంతో సోమవారం కార్గో విమానంలో ఢిల్లీ లేదా హైదరాబాద్‌కు నవీన్‌ మృతదేహం వస్తోందని సాయంత్రం లేదా రాత్రి కల్లా భువనగిరికి చేరుతుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
కోటి ఆశలతో ఎంబీబీఎస్‌ చదివేందుకు రష్యాలోని ఓరన్‌ బర్గ్‌ మెడికల్‌ కళాశాలలో చేరిన గుజ్జ నవీన్‌ మరో 6 నెలల్లో కోర్సు పూర్తి చేసుకొని స్వదేశానికి రావాల్సి ఉంది. కానీ ఇంతలోనే అతడిని మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మధ్య తరగతి కుటుంబమైనప్పటికీ కొడుకును ఉన్నత చదువు చదివించాలన్న ఆశతో గుజ్జ యాదగిరి, హేమలత దంపతులు ఆర్థిక భారాన్ని భరిస్తూనే మొదటి కుమారుడు నవీన్‌ను రష్యాలో ఎంబీబీఎస్‌ చదివిస్తున్నారు.
వారి రెండో కుమారుడు స్థానికంగా ఇంటర్‌ చదువుతున్నాడు. అయితే మరికొన్ని నెలల్లో డాక్టర్‌ పట్టాతో నవీన్ తిరిగి వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న యాదగిరి, హేమలత దంపతులు తమ కొడుకు తిరిగి రాని లోకానికి శాశ్వతంగా వెళ్లాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొడుకు జ్ఞాపకాలను వారు నెమరువేసుకుంటున్న వైనం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వారి బంధుమిత్రులు కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.
- Advertisement -