

కాలిఫోర్నియా: అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించుకుని జీవితంలో స్థిరపడాలని ఓ హైదరాబాద్ యువతి(25) కన్న కలలు కల్లలయ్యాయి.
రూ.20 లక్షలు అప్పుచేసి మరీ అమెరికా వెళ్లిన ఆ యువతి ఇటీవలే ఓ ఉద్యోగంలో కూడా చేరింది. ఇంకా తొలి నెల జీతమే అందుకోలేదు.. ఈలోగానే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. పే అండ్ స్టే వీసా స్కాంలో ఆమెను అక్కడి అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆ యువతి పరిస్థితి దయనీయంగా ఉంది. ఆమె కాలికి యూఎస్ హోంలాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు జీపీఎస్ ట్రాకర్ కట్టడమేకాక, క్యాలిఫోర్నియా దాటి వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా హాజరైన ప్రతిసారీ అక్కడ రూ.70 వేలకుపైగా లాయర్ ఫీజు చెల్లించాల్సి రావడంతో.. అంత డబ్బు తన వద్ద లేదంటూ ఆ యువతి కన్నీరుమున్నీరవుతోంది.
మోసాలు బట్టబయలు చేయడానికి…
వివరాల్లోకి వెళితే… అమెరికాలో పే అండ్ స్టే వీసా స్కాంను బట్టబయలు చేయడానికి యూఎస్ హోంలాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు మిచిగాన్‌లో యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ పేరిట ఓ దొంగ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అందులో చేరిన విద్యార్థుల్లో తప్పుడు వివరాలు, తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని ఆరోపిస్తూ 600 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేయడమేకాక, 146 మందిని అరెస్టు కూడా చేశారు.
వీరిలో అత్యధికులు భారతీయ విద్యార్థులే.. అందునా తెలుగు రాష్ట్రాల వారే అధికంగా ఉన్నారు. అయితే వీరిలో చాలా మంది విద్యార్థులకు ఇదంతా మోసమని తెలియదని, ఫార్మింగ్టన్ యూనివర్సిటీ నిజమైనదనే భావనతోనే అందులో చేరారని భారత ప్రభుత్వం వాదిస్తున్నా అమెరికా మాత్రం ఈ వాదనను ఒప్పుకోవడం లేదు.
ఇరుక్కుపోయిన హైదరాబాద్ యువతి…
హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి (పేరు కావాలనే ఇవ్వడం లేదు) కూడా ఈ స్కాంలో ఇరుక్కుపోయింది. 2015లో అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసేందుకు నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ(ఎన్‌పీయూ)కు దరఖాస్తు చేసుకుంది. అలా ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరింది.
ఇదిలా ఉండగా.. జనవరి 30న ఉదయం 6.30 గంటల సమయంలో యూఎస్ హోంలాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఆమె ఉంటోన్న ఇంటి తలుపులు తట్టారు. తలుపుతీసిన ఆ యువతిని వెంటనే తమతో పాటు రావాలని వారు ఆదేశించారు.
‘‘నాకేం అర్థం కాలేదు. నిద్రలో ఉన్న నేను తలుపు తట్టిన చప్పుడతో నిద్ర లేచాను. తలుపుతీయగానే ఎదురుగా పోలీసులు కనిపించారు. నన్ను వాళ్లతోపాటు రమ్మన్నారు. మా ఇంటినుంచి వాళ్ల కార్యాలయానికి వెళ్లాను. అక్కడ 8.30 గంటల వరకు నన్ను ఇంటరాగేషన్ చేశారు. మర్నాడు ఇంటెన్సివ్ సూపర్‌వైజర్ అండ్ అప్పియరెన్స్ ప్రోగ్రాం(ఐఎస్‌ఏపీ) కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పారు.
తీరా మర్నాడు అక్కడికి వెళ్లగానే నా కాలికి ఓ జీపీఎస్ ట్రాకర్ ట్యాగ్ కట్టారు. క్యాలిఫోర్నియా విడిచి బయటికి ఎక్కడికీ వెళ్లరాదని, నా అడ్రస్ మార్చకూడదని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇండియా వెళ్లకూడదని ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి గురువారం నన్ను పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని చెప్పారు..’’ అంటూ ఆ యువతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
స్వచ్ఛందంగా భారత్‌కు రావడానికి ప్రయత్నించినా…
‘‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ(డీఎచ్ఎస్) అధికారులతో మాట్లాడడం ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే.. నాపై పెట్టిన కేసు చాలా బలమైనది. వాళ్ల అభిప్రాయం ప్రకారం.. ఒకవేళ నా అంతట నేను స్వచ్ఛందంగా భారత్‌కు తిరిగి వచ్చేసినా, మళ్లీ 10 ఏళ్ల వరకు నాకు అమెరికా వెళ్లే అవకాశం ఉండదు. ఇదే గనుక జరిగితే నేను అమెరికా వచ్చేందుకు నా తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చడమెలా? కోర్టులో జడ్జి ఏం చెబుతారో వినడం తప్ప నాకు మరో అవకాశం లేదు..’’ అంటూ ఆ యువతి వాపోయింది.
‘‘ఈ మధ్యనే ఉద్యోగంలో చేరా.. తొలి జీతం కూడా అందుకోలేదు..’’
తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని, తనను అమెరికా పంపడానికి తన కుటుంబ సభ్యులు రూ.20 లక్షలపైగా అప్పు చేశారని, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తనకు ఏ ఉద్యోగమూ దొరకలేదని, ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరితో ఉద్యోగం చేసుకోవచ్చని ఓ యువకుడు చెబితే తాను ఈ యూనివర్సిటీలో చేరానని ఆ యువతి పేర్కొంది.
మూడు నెలల క్రితమే నెలకు రూ.4 వేల డాలర్ల వేతనంతో కూడిన ఓ ఉద్యోగం లభించిందని, ఇంకా తొలి నెల జీతం కూడా అందుకోలేదని ఆ యువతి వాపోయింది. రూ.20 లక్షల అప్పులో ఇంకా ఒక్క పైసా కూడా చెల్లించలేదని, ఇప్పుడు భారత్‌కు తిరిగెళ్లాల్సి వస్తే ఏం చేయాలో తోచడం లేదని ఆందోళన చెందుతోంది.
‘‘కేసు ఫైట్ చేయడమూ అంత తేలికేం కాదు..’’
అలాగని చెప్పిఅమెరికాలోనే ఉండటానికి కూడా కుదరదని, కోర్టులో హాజరైన ప్రతిసారీ లాయరు ఫీజు కింద 1000 డాలర్లు (మన డబ్బులో రూ.70వేలకు పైగా) కట్టాలని, అంత డబ్బు తన వద్ద లేదని, అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదంటూ కన్నీరుమున్నీరవుతోంది. ప్రస్తుతం ఆ యువతి వద్ద ఖర్చులకు కూడా చేతిలో పెద్దగా డబ్బు లేదు.
పొరుగునే నివసిస్తోన్న ఓ భారతీయ కుటుంబం ఆమె పరిస్థితిపై జాలిపడి కొంత బియ్యం, కొన్ని కూరగాయలు అందజేసినట్లు తెలుస్తోంది. అమెరి‘కలలు’ కన్న ఎంతోమంది విద్యార్థులు ఈ ఫేక్ యూనివర్సిటీ పుణ్యమాని అక్కడి జైళ్లలో బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు.
‘‘ఒకవేళ అమెరికాలోనే ఉండి కేసు విషయమై ఎవరైనా లాయర్‌ను పట్టుకుని ఫైట్ చేద్దామా అంటే.. అదీ కష్టమే. ఎందుకంటే అమెరికాలో లాయర్‌కు కేసును టేకప్ చేసినందుకుగాను కనీసం 1000 నుంచి 2000 డాలర్లు ఆ యువతి చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు కేసు వాయిదా ఉన్న ప్రతిసారీ మళ్లీ ఎంతోకొంత ఖర్చు.
ఇవన్నీ చూసుకుంటే కేసు తేలే నాటికి మళ్లీ ఆ యువతి తండ్రికి మరో రూ.20 లక్షల అప్పు భారం మీదపడుతుంది.. అందుకే ఇదంత తేలిక కాదు..’’ అని అక్కడి భారతీయ విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తోన్న.. అమెరికాలో సెటిలైన టీఆర్ఎస్ ప్రతినిధి నవీన్ జలగం వ్యాఖ్యానించారు.








