అసలు తెలంగాణలో ఏం జరిగింది?
అంతకుముందంతా ఓటరు మదిలో ఏముందో తెలుసుకోలేక..ఎగ్జిట్ పోల్స్ అంతా గందరగోళమయంగా మారిన దశలో.. ఒక్కసారిగా టీఆర్ఎస్ గాలిని.. లగడపాటి సర్వే టీమ్ ల్లాంటివి ముందుగా ఎందుకు ఊహించలేకపోయాయి. ఒక్క లగడపాటే కాదు..చాలా సర్వేలు ప్రజాకూటమికి ఆధిక్యతను చాటాయి. అలాగే ఇండిపెండెంట్లు వస్తారని ముందుగా పేర్లు చెప్పినా.. గెలవకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకీ ఆ చిదంబర రహస్యం ఏమిటి? ప్రభుత్వ వ్యతిరేకత ఏ గాలికి కొట్టుకుపోయింది..అన్నది ఒకరకంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంత తుపాను గాలి ఉంటే.. దానినెందుకు కొన్ని ఎగ్జిట్ పోల్స్ పసిగట్టలేకపోయాయి అన్నది కూడా కారణాలు అన్వేషిస్తే..
1..ప్రజాకూటమి ఏర్పాటు.. ఇందులో ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలయిక, వ్యూహాలు, బహిరంగ సభలు.. బహుశా ప్రజలకి నచ్చకపోయి ఉండవచ్చు. కేసీఆర్ ఎప్పటిలాగే ఆంధ్రా సెంటిమెంట్ ని మళ్లీ రగిలించి..ప్రజాకూటమి వస్తే పరిపాలనంతా అమరావతి నుంచి చేస్తారు.. ఇది మనకు అవసరమా? ఇప్పటివరకు ఆంధ్రావాళ్లు చేసింది చాలదా? మళ్లీ అధికారమిచ్చి వారి పెత్తనాన్ని నెత్తిన పెట్టుకుందామా? అని ప్రజలను రెచ్చగొట్టడం టీఆర్ఎస్ కి బాగా కలిసి వచ్చింది.
2. అంతవరకు కాంగ్రెస్ మంచి ప్రారంభంలో ఉండగా..వీళ్లు వచ్చి కలవడంతో మొత్తానికి ఎసరు వచ్చిందనేది ఒక వాదన. ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్లు కూడా ఒక్క సీటు గెలవకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఎవరికివారు పోటీ చేసి తర్వాత పొత్తు కుదుర్చుకుందాం అని అనుకుంటే ఒక పద్ధతిగా ఉండేదని కొందరంటున్నారు. ఈవీఎంలపై అనుమానాలు, ఓట్లు గల్లంతైనా పట్టించుకోకపోవడంపై ఇది ప్రజాస్వామ్యమేనా? అంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటివాళ్లు, కాంగ్రెస్ లో హేమాహేమీలు చాపచుట్టేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
3. బీజేపీ కూడా వారికి శక్తి లేకపోయినా..మొత్తం 119 సీట్లలో పోటీకి దిగడం వల్ల..ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో..అవన్నీ బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయాయనేది విశ్లేషకుల మాట..గతంలో ఉన్న రెండు సీట్లలో కూడా ఒకటి పోగొట్టుకోవడం విచిత్రంగానే ఉంది. అలాగే సొంతంగా గత ఎన్నికల్లో 21 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి 19కే పరిమితమైంది.
4. ప్రచారం కూడా వ్యూహాత్మకంగా కేసీఆర్ ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకొని.. అసెంబ్లీని రద్దు చేసి..అంతే స్పీడుగా అభ్యర్థులను ప్రకటించి..వారిని ప్రజల్లోకి వదిలేశారు. అంతేకాకుండా అన్నీ తానై సభలకు వెళ్లి ప్రసంగించి ప్రజలను ఉత్తేజితులను చేశారు. ఈలోపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మరోవైపు రాహుల్ గాంధీ, ఇటు నుంచి బీజేపీ నుంచి అమిత్ షా, ప్రధానిమంత్రి మోదీ అందరూ జంప జాతరలా తరలి వచ్చారు.
5. అదే ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటుకే సమయమంతా గడిచిపోయింది. అక్కడ కేసీఆర్, అభ్యర్థులు రెండు రౌండ్లు అన్ని గ్రామాలు తిరిగేసినా వీళ్లు అభ్యర్థులనే ప్రకటించ లేదు. దాంతో ప్రకటించిన అభ్యర్థులు అన్నీ సర్దుకొని వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. కాంగ్రెస్ లో కోట్లు ఖర్చుపెట్టి సీటు తెచ్చుకున్న నేతలు ప్రచారానికి సరైన సమయం లేక..ఓడిపోయారనే అపవాదులున్నాయి.
6. కాంగ్రెస్ లో కోట్ల రూపాయలకి సీట్లు అమ్ముకున్నారన్న వదంతులు షికార్లు చేశాయి. అలా కొనుక్కుని వచ్చినవారు ఒకొక్క నియోజకవర్గంలో చదివించుకున్నది, ఖర్చు చేసినది కలిపి సుమారు రూ.40 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. వీరందరూ నెత్తిన చెంగేసుకొని వెళ్లిపోయారు. కొందరైతే నియోజకవర్గాలు వదిలేసి సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ తిరగడంతోనే పుణ్యకాలమంతా గడిచిపోయిందని కొందరు నెత్తి కొట్టుకుంటున్నారు.
7. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయాయని అంటున్నారు. అందులో ఒకటి కల్యాణ లక్ష్మీ పథకం.. ఒక ఇంట్లో అమ్మాయికి పెళ్లయితే రూ.1.50లక్ష ఇవ్వడం పేదవాళ్లకి పెద్ద వరంగా మారింది. ఆడపిల్లకి పెళ్లి చేయడమనే పెద్ద సమస్య నుంచి వారిని దాటేయించినట్లయింది. అలాగే రైతులు మరణిస్తే తక్షణం ఆ కుటుంబానికి రూ.5లక్షలు అందించడం ఒకటి, రైతు రుణ బంధు..పంట వేసుకోవడానికి రూ.8వేలు ఇస్తామని చెప్పడం..అందులో సగం డబ్బులు ఇవ్వడంలాంటివి ప్రత్యక్షంగా పేదవాళ్లకు మేలు చేశాయి. వెయ్యి రూపాయల పెన్షను కూడా అందడం, అది కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నా..అది పేద ప్రజలు కేసీఆర్ ఇస్తున్నాడని అనుకోవడం ఒకటి..
8. ఆఖరుగా నీళ్లు సంగతి దేవుడెరుగు కానీ..ముందుగా కాల్వలు తవ్వించి, రిజర్వాయర్ల కోసం ఊళ్లు ఖాళీ చేయించి..ఏదో జరగబోతోందనే ఒక సందేశాన్ని అంతర్లీనంగా పంపించారు. రేపు ఏడాదికి ఒకసారి వచ్చి వారం రోజులు ఉండే గోదావరి వరద నీరు..అలాగే అక్కడ మహరాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ నుంచి వదిలే నీరు..ఇదంతా కలిపి ఇన్ని ప్రాజెక్టులకు ఎలా ఎత్తిపోతలు చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..ఎన్ని పంపులతో ఎంత సేపు ఎత్తితే..ఆ వారం రోజుల్లో ప్రవహించే గోదావరి నుంచి ఎంత వరకు తోడగలరు? మళ్లీ ఆ కాళేశ్వరం దగ్గర మళ్లీ లిప్ట్.. మళ్లీ అక్కడ నుంచి ఇంకో లిఫ్ట్.. ఇలా ఎత్తిపోసుకుంటూ వారం రోజుల్లో ప్రవాహగోదావరి నుంచి ఎంత నీటిని తీసి మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా సస్యశ్యామలం చేస్తారని నిపుణులు అడుగుతున్నారు. అయితే ఒక అవకాశం మాత్రమే ఉందని కొందరు మేధావులు పేర్కొంటున్నారు. అదెలా అంటే ఈ ప్రవాహవేగం లేని నీటిని..లిఫ్ట్ లతో ఎత్తడం వల్ల.. అక్కడ భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. తద్వారా కొన్నేళ్లకు గాలితో తేమశాతం పెరుగుతుంది..అడవులు పెరుగుతాయి. అలా అక్కడ మేఘాలు నిలబడి..వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా జరగడానికి కనీసం 20ఏళ్లు పైనే పడుతుంది. ఈలోపు గోదావరికి ఆ ఏడాది వరదలు రాకపోతే..ఈ ఎత్తిపోతల పథకాలన్నీ నోళ్లు తెరుచుకొని కూర్చుంటాయి..అప్పుడు కేసీఆర్ ఏమంటాడో తెలుసా? నేను ప్రాజెక్టులు కట్టాను..పై నుంచి గోదాట్లో నీళ్లు రాకపోతే నా తప్పేమైనా ఉందా సెప్పండి.. నీళ్లు రామ్మనండి..నేనివ్వకపోతే అడగండి..అంటాడని అప్పుడే సెటైర్లు పేలుతున్నాయి.
9. ఇక చివరికి కర్ణుడికి చావుకి కారణాలనేకమన్నట్టు ప్రజాకూటమి ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. అలాగే టీఆర్ఎస్ గెలుపునకు ఎన్నో కారణాలున్నాయి. అయితే వచ్చే ఐదేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ వస్తాడా..అంటే.. అప్పుడు చూద్దాం అనేటోళ్లు..అప్పటికి పాతోడైపోతాడు అనేటోళ్లు కొంతమంది ఉన్నారు.. మొత్తానికి వచ్చే ఐదేళ్లలో ఆయన కల..నా బంగారు తెలంగాణ అలా చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం..
శ్రీనివాస్ మిర్తిపాటి