అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం ఫలితాల సరళి మొదలైన గంట సేపటికే గాలి టీఆర్ఎస్ వైపు ఉన్నట్లు స్పష్టమైంది. మధ్యాహ్నానికల్లా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను గెలుచుకున్న టీఆర్ఎస్ తిరిగి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి చతికిల పడింది. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి చెందిన హేమాహేమీలు సైతం ఈ ఎన్నికల్లో మట్టికరిచారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మంగళవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..‘తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి శుభాకాంక్షలు..’ అని తెలిపారు. అంతకుముందు ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో విజయం సాధించిన పార్టీలకు అభినందనలు తెలిపారు.