హైదరాబాద్: కాంగ్రెస్-టీడీపీ పొత్తు తెలంగాణ పాలిట గుదిబండ అని, వచ్చే ఎన్నికల్లో ‘మహా కూటమి’ని చిత్తు చిత్తుగా ఓడించాలని ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణతో పాటు పలువురు నేతలు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.
తెలంగాణకు ఏమిస్తారు?
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ .. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న రాహుల్ గాంధీ.. తెలంగాణకు ఏమిస్తారో స్పష్టం చేసి తెలంగాణ గడ్డపై కాలు మోపాలంటూ డిమాండ్ చేశారు.
తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని అభివర్ణించిన హరీశ్‌రావు.. కేంద్ర పదవులను కేసీఆర్ గడ్డిపోచలా త్యాగం చేశారని కొనియాడారు. టీడీపీ పక్కా ఆంధ్ర పార్టీ అని వ్యాఖ్యానించిన ఆయన టీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ అని అన్నారు.
అవి అవకాశవాద పార్టీలు…
జాతీయ పార్టీలు అవకాశవాద పార్టీలని… గతంలో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, నాలుగు ఎంపీ సీట్ల కోసం జాతీయ పార్టీలు ఎంతకైనా తెగిస్తాయని హరీశ్‌రావు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీదంటూ హరీశ్‌రావు దుయ్యబట్టారు.