చంద్రబాబు.. నన్ను, జనసేనను వాడుకున్నారు: పవన్ కల్యాణ్ ఆవేదన

10:56 pm, Sun, 14 October 18
janasena-pawan-kalyan

janasena-pawan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. తనను, తన పార్టీని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  జనసేనను ఒక రాజకీయ పార్టీగా చంద్రబాబు పరిగణించలేదన్నారు.

అమరావతిలో శనివారం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా చంద్రబాబు అఖిలపక్ష సమావేశాలను చిత్తశుద్ధితో నిర్వహించలేదని, 2014లో తిరుపతిలో జరిగిన సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ ఎన్నికల తర్వాత ప్రత్యేక ప్యాకేజీగా మారిపోయిందని విమర్శించారు.  పూటపూటకు మాట మారిస్తే రాజకీయ చిత్తశుద్ధి ఎక్కడి నుంచి వస్తుందని జనసేనాని ప్రశ్నించారు.

బీజేపీని ఎన్నడూ వెనకేసుకురాలేదు…

బీజేపీని తాను ఎన్నడూ వెనకేసుకురాలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి నిజనిర్ధారణ కమిటీ(జేఎఫ్ఎఫ్ సీ)లో తనతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, పద్మనాభయ్య, కృష్ణారావులు కూడా సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు.

చంద్రబాబే వెనక్కి లాగుతున్నారు…

ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా రూ.70 వేల కోట్ల  నిధులు రావాల్సి ఉన్నట్లు తమ విచారణలో తేలిందని… ఒకపక్క ప్రత్యేక హోదా అంటూ తాను ముందుకు పోతుంటే, ప్రత్యేక ప్యాకేజీ అంటూ చంద్రబాబు వెనక్కు లాగుతున్నారని పవన్ విమర్శించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, హక్కుల కోసం జనసేన చివరివరకూ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.