vijayashanti

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి.. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా, మరోసారి కేసీఆర్ సర్కారుపై సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ను ప్రస్తావిస్తూ.. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుని వరుస ట్వీట్లు చేశారు.

కేసీఆర్ ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అంటూ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రాజమౌళి దర్శకత్వం వహించే ‘RRR’ చిత్రానికి వచ్చే కలెక్షన్లను అధిగమించే విధంగా కేసీఆర్ గారు కొత్త ‘RRR’ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ కేసీఆర్ గారి ‘RRR’ ఏమిటంటే ‘రీజనల్ రింగ్ రోడ్’ అని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఆపై “ఈ ‘RRR’ కు, తెలంగాణ కేబినెట్ విస్తరణలో జరిగే ఆలస్యానికి ఒక లింక్ ఉందని తెరాస నేతలు చెబుతున్నారు. కేసీఆర్ గారి కేబినెట్ లో చేరడమంటే మంత్రులుగా ప్రమాణం చేసేవారు కొంత రిస్క్ చేయక తప్పదని తెలుస్తోంది’ అన్నారు.

హరీశ్ రావు లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టాలని కేసీఆర్..

అంతేగాక, ‘కేసీఆర్ గారి కేబినెట్ లో చేరబోయే వారికి విధించబోయే షరతులు ఏమిటంటే… తెరాస ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ పేరుతో చేయబోతున్న లక్ష కోట్ల కుంభకోణానికి, మంత్రులు ఆమోదముద్ర వేయడంతో పాటు దానికి పూర్తి భాద్యత వహించాలి. రేపు ఏమైనా చట్టపరమైన ఇబ్బందులు వస్తే మంత్రులే భరించాలి.. దీనికి సిద్ధపడిన వాళ్లు మాత్రమే మంత్రులుగా ప్రమాణం చెయ్యాలని కేసీఆర్ గారు మెలిక పెట్టారట.ఈ షరతులకు అంగీకరించని హరీశ్ రావు గారి లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

‘కేసీఆర్ గారి కేబినెట్లో మంత్రులను రబ్బర్ స్టాంప్ లా వాడుకుంటారని తెలుసు కానీ… ప్రభుత్వం చేసే అవినీతికి ఏజెంట్లుగా మార్చాలనుకోవడం దారుణం” అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. విజయశాంతి ట్వీట్లపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. విజయశాంతి చెప్పిన ఆర్ఆర్ఆర్ ఆసక్తికరంగా ఉందని వారంటున్నారు. అయితే, దీనిపై టీఆర్ఎస్ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.


English Title:

vijayashanthi slams kcr government for regional ring road