హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చాలా నియోజకవర్గాల్లో తన అధిక్యం కొనసాగిస్తూ భారీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు భారీగా సంబరాలు జరుపుకుంటున్నాయి. ప్రాథమిక ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో టీఆర్ఎస్ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు భారీ ఎత్తున చేరుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నారు.
ఈ ఎన్నికలలో తమ పార్టీ భారీ విజయం సాధించబోతోందని స్పష్టం కావడంతో కార్యకర్తలు స్వీట్లు, కేకులు పంచుకుంటున్నారు. కేసీఆర్ జిందాబాద్, టీఆర్‌ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చేందుకు రెడీ అవుతున్నారు.
అలాగే పలు జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్ కార్యాలయాల వద్ద సంబరాలు మొదలయ్యియి. అయితే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ స్పష్టం చేశారు.