జగిత్యాల: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తొలి ఓటమి ఎదురయింది. ఈ ఎన్నికల్లో జగిత్యాల ప్రజాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డికి టీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. టీఆర్ఎస్ నేత సంజయ్ చేతిలో జీవన్ రెడ్డి 60,676 ఓట్ల భారీ తేడాతో ఘోర పరాజయం చవిచూశారు.
తుది ఫలితాలు వెలువడకముందే జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. మహాకూటమి తరఫున జీవన్ రెడ్డి విజయం సాధిస్తారని లగడపాటి రాజగోపాల్ తన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇటీవల జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన లగడపాటి ‘మీరు మంత్రి కాబోతున్నారు.. కంగ్రాట్స్..’ అంటూ ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
కానీ వాస్తవంలో అంతా తలకిందులైంది. మరోవైపు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనూ మరో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి గెలుపు కష్టసాధ్యంగా మారింది. ఇక్కడ జానారెడ్డి పై.. నోముల నర్సింహయ్య వెయ్యి ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.