హైదరాబాద్: ‘‘స్వామీ.. మా శాఖకు మంత్రి లేరు, ముఖ్యమంత్రి స్థాయికి పోలేము.. పోనీ ఉన్నతాధికారులను అయినా కలుద్దామా అనుకుంటే వారు మాకు సమయమే ఇవ్వడం లేదు.. మా గోడును ఎవరికి చెప్పుకోమంటారు? మీరే మా బాధను అర్థం చేసుకోవాలి.. మా శాఖను ఇతర శాఖల్లో విలీనం చేయొద్దని సీఎంతో ఒక్క మాట చెప్పండి..’’
ఇదీ.. ఇటీవల చిన్న జీయర్ స్వామికి కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు పెట్టుకున్న మొర. అసలేం జరిగిందంటే.. తెలంగాణలో రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నట్లుగా ఓ పది రోజులుగా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. దీంతో రెవెన్యూ శాఖ ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు.
తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీశ్ నేతృత్వంలో రెవెన్యూ ఉద్యోగుల ప్రతినిధి బృదం.. శనివారం శంషాబాద్‌లోని ఆశ్రమంలో చిన్న జీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రెవెన్యూ శాఖ విలీనం వార్తలపై…
రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా పది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయని, 200 ఏళ్ల చరిత్ర ఉన్న రెవెన్యూ శాఖను రద్దు చేస్తామని, ‘కలెక్టర్’ పేరునూ మారుస్తామని అంటున్నారని ప్రస్తావించారు.
నిజానికి ప్రజలకు ఏ కష్టమొచ్చినా స్పందించేది తామేనని, నాలుగున్నరేళ్లుగా రేయింబవళ్లు పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నామని, కొత్తగా ప్రభుత్వం ఏ పథకం ప్రకటించినా.. దానిని ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచుతున్నామని వారు పేర్కొన్నారు.
తాజాగా వినిపిస్తోన్న ప్రచారంతో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని వారు వివరించగా.. చిన్న జీయర్ స్వామి స్పందిస్తూ.. ‘‘నిశ్చింతగా ఉండండి.. మీకెలాంటి ఇబ్బందులు రావు..’’అని అభయమిచ్చారట. ఈ విషయాన్ని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీశ్ ధ్రువీకరించారు.








