
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్లీ జలజగడం మొదలైంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి కొత్త లిఫ్ట్ స్కీం ఏర్పాటు చేయడం అన్యాయమని ఫిర్యాదులో పేర్కొంది. శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని ఏపీకి తరలించే ప్రయత్నం జరుగుతోందని కృష్ణా బోర్డుకు వివరించింది.
ఏపీ ప్రభుత్వం తెచ్చిన 203 జీవో అక్రమమని, వెంటనే నిలిపివేయాలని కోరింది. కేఆర్‌ఎంబీ అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టాలని, పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించారని తెలంగాణ సర్కార్ పేర్కొంది.
టెండర్ల ప్రక్రియ నిలిపివేసేలా కృష్ణా బోర్డు చర్యలు చేపట్టాలని కోరింది. రేపు మధ్యాహ్నం ఇదే అంశంపై తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృష్ణా రివర్ బోర్డు చైర్మన్‌తో మాట్లాడనున్నారు.








