
హైదరాబాద్: ఖాకీ యూనిఫారం ఒంటి మీద పడగానే ఇక తమకు ఎదురే లేదనుకుంటారు పోలీసుల్లో చాలామంది. ఆ ధీమాతో విధి నిర్వహణలో కొన్నిసార్లు తప్పులు కూడా చేస్తూ ఉంటారు. ఇలాగే ఓ వ్యక్తిపై తప్పుడు కేసు పెట్టడమేకాక అతడ్ని అరెస్టు చేసి వేధించినందుకుగాను ఓ ఎస్సైకి తెలంగాణ హైకోర్టు తాజాగా నాలుగు వారాల జైలుశిక్ష విధించింది.
సంచలనంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతానికి చెందిన రామడుగు ఓంకార్ వర్మ అనే వ్యక్తి బోరబండలోనే ఓ స్టేషనరీ దుకాణాన్ని నడుపుతుండేవాడు. అదే ప్రాంతానికి చెందిన పద్మ అనే మహిళ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చదవండి: పవన్ కళ్యాణ్‌కు షాక్.. జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై!
తన ఇంట్లో నిధి ఉందని చెప్పి ఓంకార్ వర్మ తనను మోసం చేశాడని, రూ.10 వేలు తీసుకుని ఆపైన కనిపించకుండా పోయాడంటూ ఆమె ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై అశోక్ నాయక్.. ఓంకార్ వర్మపై కేసు నమోదు చేయడమేకాక అతడ్ని అరెస్టు కూడా చేశాడు.
ఎస్సైపై కోర్టు ధిక్కరణ కేసు…
ఈ కేసు విషయమై ఓంకార్ వర్మ న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాడు. వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ఎఫ్ఐఆర్‌ను పరిశీలించింది.
ఓంకార్ వర్మ అసలు పద్మ అనే మహిళను ఎప్పుడు కలిశాడు, ఏ రోజున ఆమె వర్మకు డబ్బు ఇచ్చింది, ఏ రోజున గుప్త నిధులకు సంబంధించి ఇంట్లో తవ్వకాలు జరిగాయి.. ఇలాంటి వివరాలేమీ ఎఫ్ఐఆర్‌లో లేకపోవడాన్ని హైకోర్టు గమనించింది.
చదవండి: కరోనా వైరస్: గడగడలాడుతోన్న ప్రపంచం.. ఒక్క చైనాలోనే 170 మంది మృతి
ఎఫ్ఐఆర్‌లో కేసుకు సంబంధించి సరైన వివరాలు లేకపోవడం, అరెస్టు చేసే ముందు ఓంకార్ వర్మకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41-ఏ కింద కనీసం నోటీసు కూడా ఇవ్వకపోవడం హైకోర్టు గమనించింది. పైగా అతడిపై ఏడేళ్లకంటే ఎక్కువే శిక్ష విధించేందుకు వీలు కల్పించే సెక్షన్లు నమోదు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విధి నిర్వహణలో ఎస్సై నిర్లక్ష ధోరణిని హైకోర్టు గమనించింది. అన్యాయంగా ఓ వ్యక్తిపై తప్పుడు కేసు పెట్టడమేకాక అక్రమంగా అరెస్టు చేసి వేధించినందుకుగాను.. ఎస్సై అశోక్ నాయక్‌కు రూ.2 వేల జరిమానాతోపాటుగా నాలుగు వారాల జైలుశిక్ష కూడా విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్ర రావు తీర్పు చెప్పారు.
అంతేకాకుండా, ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ పోలీసు కమిషనర్, హోంశాఖ సెక్రటరీలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా ఎస్సై అశోక్ నాయక్‌కి ఆరు వారాల గడువును కూడా హైకోర్టు ఇచ్చింది.








