
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (NRC)లకు నిరసనగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు రాజ్‌ఘాట్ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఓ వ్యక్తి తుపాకితో హల్‌చల్ చేశాడు.
అతడు జరిపిన కాల్పుల్లో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. మీడియా ప్రతినిధులు, పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. కాల్పులు శబ్దం వినిపించిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
గాయపడిన విద్యార్థిని షాదాబ్‌గా గుర్తించారు. జామియా మిలియా యూనివర్సిటీలో అతడు మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నాడు. గాయపడిన విద్యార్థిని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చేర్చారు. నిరసన ప్రదర్శన చేసిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారు.
కాల్పుల ఘటనతో జామియానగర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులకు మద్దతుగా వందలాది మంది స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బారికేడ్లను ధ్వంసం చేసి యూనివర్సిటీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయి. పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని గ్రహించిన అధికారులు.. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించాయి. ఈ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.
ఘటనాస్థలంతోపాటు వర్సిటీ ప్రాంతంలో అర్ధరాత్రి వరకు నిరసనలు కొనసాగాయి. ఘటనపై సౌత్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీ చిన్మయ్ బిస్వాల్ స్పందించారు.. యువకుడు బహిరంగంగా పిస్టల్ ఊపుతూ కనిపించాడని, అతన్ని పట్టుకున్నామని తెలిపారు. తమ వద్ద ఉన్న వీడియోను పరిశీలిస్తున్నామన్నారు.








