
అమరావతి: జనసేనకు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు గురువారం గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పారు. కొంతకాలంగా పార్టీ వైఖరి, పవన్ కల్యాణ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న లక్ష్మీనారాయణ చివరికి ఆ పార్టీ నుంచి నిష్క్రమించారు.
ఈ మేరకు ఆయన గురువారం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు తన రాజీనామా లేఖను పంపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడాన్ని నిరసిస్తూ లక్ష్మీనారాయణ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని ఆయన తన రాజీనామా లేఖలోనూ పేర్కొన్నారు.
‘‘మీలో నిలకడైన విధి విధానాలు లేవు, అందుకే..’’
‘‘పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని మీరు గతంలో అనేక పర్యాయాలు చెప్పారు. ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని అనిపిస్తోంది. కాబట్టి, నేను పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను..’’ అని జేడీ లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు.
అలాగే.. ‘‘ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతి కార్యకర్తకి, నాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వారందరికి మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని కూడా లక్ష్మీనారాయణ తన లేఖలో వివరించారు.
చదవండి: కరోనా వైరస్: గడగడలాడుతోన్న ప్రపంచం.. ఒక్క చైనాలోనే 170 మంది మృతి
నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్, జేడీ లక్ష్మీనారాయణల మధ్య విభేదాలు పొడచూపినట్లు గతంలో వార్తలు వినవచ్చినా.. అప్పట్లో వాటిని జేడీ ఖండించారు.
ఇటీవల బీజేపీతో జనసేన పొత్తుతోపాటు మరికొన్ని కీలక అంశాలపై పార్టీ తనను సంప్రదించకపోవడంపై లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.









