
హైదరాబాద్: షేర్ మార్కెట్లో నష్టాలు.. దీపావళి పండుగ రోజునే ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఏ పాపం ఎరుగని ఓ చిన్నారిని అనాథగా మార్చేశాయి. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన బాపయ్య చౌదరి, శిరీష దంపతులు. వీరిద్దరూ హైదరాబాద్లో స్ధిరపడ్డారు. గచ్చిబౌలిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ దంపతులకు పద్మప్రియ అనే మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. వీరిద్దరూ ఉద్యోగాల రీత్యా బిజీగా ఉండటంతో.. పద్మప్రియ వాళ్ల అమ్మమ్మ దగ్గర పెరుగుతోంది.
ఈ క్రమంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో కొద్దికాలం క్రితం బాపయ్య తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని షేర్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టాడు. అయితే.. లాభాలు వస్తాయి అనుకున్న షేర్ మార్కెట్లో అనుహ్యంగా నష్టాలు రావడంతో వారికి ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి.
బాపయ్య షేర్ మార్కెట్లో దాదాపు కోటిన్నర రూపాయల వరకు నష్టపోయాడు. కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం.. కళ్లముందే షేర్ మార్కెట్ ద్వారా కరిగిపోవడంతో శిరీష తట్టుకోలేకపోయింది.
భర్త బాపయ్య ఇంట్లో లేని సమయంలో దీపావళి పండుగ రోజైన బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన బాపయ్యకు.. భార్య శిరీష శవమై కనిపించడంతో తట్టుకోలేకపోయిన బాపయ్య వెంటనే సనత్నగర్ ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలా తల్లిదండ్రుల అకాల మరణంతో.. చిన్నారి పద్మప్రియ ఇప్పుడు అనాథగా మారిపోయింది. వీరి మరణ వార్త విని.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.








