హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై చేస్తున్న విమర్శలను అదే స్టయిల్లో చంద్రబాబునాయుడు తిప్పి కొట్టారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నిజాంపేటలో గురువారం నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ.. ‘‘నేను చార్మినార్ కట్టలేదు. కేసీఆర్ కట్టాడేమో నాకు తెలియదు!’’ అంటూ చంద్రబాబు నవ్వులు పూయించారు.
దీంతో చంద్రబాబు ప్రసంగం వినేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు కూడా కరతాళ ధ్వనులు, నవ్వుల ద్వారా తమ ప్రతిస్పందన తెలియజేశారు.
ఇటీవల టీఆర్ఎస్ అధినేత పలు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని పక్క రాష్ట్ర్రం సీఎం చంద్రబాబు చెప్పుకుంటున్నారంటూ కేసీఆర్ బహిరంగ సభల్లో.. చంద్రబాబు నాయుడి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు.
ఈ విషయమై ఇప్పటికే పలు సభలు, రోడ్ షోలలో చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ, వివరణ ఇచ్చారు. తాను సైబరాబాద్‌ను నిర్మించాననే విషయం అందరికీ తెలుసునని, కానీ కేసీఆర్ మాత్రం ఎగతాళి చేస్తున్నారని పేర్కొన్నారు.
గర్వంగా చెబుతున్నా.. సైబరాబాద్ నా మానసపుత్రిక
తాను అనని మాటలు కూడా అన్నట్లుగా కేసీఆర్ చెబుతుండడంపై కోపంతో ఉన్న చంద్రబాబు.. గురువారం నిజాంపేట రోడ్ షోలో మాట్లాడుతూ.. కేసీఆర్ స్టయిల్లోనే ఆయనపై సెటైర్లు వేశారు.
‘‘ఆయనే (కేసీఆర్) మొత్తం కట్టానని అనుకుంటున్నాడు. గర్వంగా చెబుతున్నా, సైబరాబాద్ నగరాన్ని నేనే నిర్మాణం చేశాను. ఇది నా మానసపుత్రిక. నా బ్రెయిన్ చైల్డ్..’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా తన కృషి ఉందంటూ చంద్రబాబు తనను తాను ఆధునిక తెలంగాణ సృష్టికర్తగా చెప్పుకున్నారు.
కేసీఆర్ తన ఫామ్‌హౌస్ తప్ప ఇంకేమీ కట్టలేదు…
అంతేకాదు, నాలుగున్నరేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్, హైదరాబాద్ లో ఒక్క రోడ్డుకైనా మట్టి వేశారా? ఆయన హయాంలో కొత్తగా ఏదైనా కట్టారా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్, మెట్రో.. ఇలా హైదరాబాద్‌లో ఏది తీసుకున్నా అన్నీ తన హయాంలో వచ్చినవేనని తెలిపారు.
అసలు కేసీఆర్ తన హయాంలో ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్నానని అన్నారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్ తప్ప ఇంకేమీ కట్టలేదని విమర్శించారు.
మాటలు తూలడం చాలా తేలిక…
మాటలు తూలడం చాలా తేలిక అని, కేసీఆర్ తనను అనరాని మాటలు అంటున్నాడని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో చంద్రబాబుకేంటీ పని, తెలంగాణలో టీడీపీకేంటీ పని అని కూడా కేసీఆర్ ప్రశ్నిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, తెలంగాణ బాగుపడితే చూసి ఆనందించే మొదటి వ్యక్తిని తానేనని కూడా చంద్రబాబు చెప్పారు.
అహ్మదాబాద్‌ను మోడీ ఎందుకు తీర్చిదిద్దలేకపోయారు…
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపైనా ఆయన విరుచుకుపడ్డారు. దేశాన్ని మారుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు కానీ, ఆయన్ని ఆయనే మార్చుకోలేకపోయారని విమర్శించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌కు మన హైదరాబాద్‌కు ఏమైనా పోలిక ఉందా? పన్నెండేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మోడీ, అహ్మదాబాద్‌ను ఎందుకు తీర్చిదిద్దలేకపోయారు అని ప్రశ్నించారు.